అపరిష్కృతంగా వున్న జర్నలిస్టుల సమస్యలను త్వరలోనే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు.
దేశంలో ఇప్పటికి ఏ రాష్ట్రం కల్పించని విధంగా జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టామని సిఎం గుర్తు చేశారు. గురువారం టియుడబ్ల్యుజె ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్ ముఖ్యమంత్రిని తన అధికారిక నివాసంలో కలిసారు. అక్రిడిటేషన్ల జారీ, హెల్త్ కార్డుల జారీ, నివాస గృహ వసతి తదితర అంశాలపై టియుడబ్ల్యుజె నేతలు ముఖ్యమంత్రితో చర్చించారు. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం అలసత్వం వహించకుండా తక్షణమే పరిష్కరించాలని సమాచార శాఖ కమిషనర్ ను సిఎం ఆదేశించారు. త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నదని, జర్నలిస్టులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.