జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించండి-టీయుడబ్ల్యుజె వినతి
హైదరాబాద్;జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉచిత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) విజ్ఞప్తి చేసింది. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీ ఎస్ పి జె ఏ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ ఫోటో గ్రఫీ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డికి టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ వినతి పత్రాన్ని అందించారు.
అసలే చాలీచాలని వేతనాలతో అతికష్టంగా బతుకుబండిని లాగుతున్న జర్నలిస్టులకు తమ పిల్లలను ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివించడం మోయలేని భారమైపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎలాంటి జీతభత్యాలు లేకుండా మీడియా సంస్థల్లో వెట్టి చాకిరి చేస్తున్న లోకల్ రిపోర్టర్లు అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పరిస్థితి నెలకొందన్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, డిఇఓ లు సర్క్యులర్లు జరీచేస్తున్నప్పటికీ, పాఠశాలల యాజమాన్యాలు వాటిని బేఖాతర్ చేస్తున్నట్లు వినతి పత్రంలో వాపోయారు. ఆయా జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా, అర్బన్ ఏరియాల్లో ఉన్న కార్పోరేట్ విద్యాసంస్థల్లో కనీసం 50 శాతం రాయితీతో విద్యను అందించేవిధంగా చర్యలు చేపట్టాలని విరాహత్ కోరారు. ప్రపంచ ఫోటో గ్రఫీ డే వేడుకల్లో ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్.హరి, టీయుడబ్ల్యుజె నాయకులు ఎ.రాజేష్, వి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Post Comment