చేపల పెంపకం వృత్తిగల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంది- ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు
చేపకు, చెరువుకూ వున్న గత బంధాన్ని తిరిగి నెలకోల్పేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ చెరువులు జలకళను సంతరించుకున్న నేపథ్యంలో చెరువు చెరువుకు చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 48 కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా వున్న 4,533 చెరువులలో 35 కోట్ల చేప పిల్లలను పోసి సొసైటీల ద్వారా పెంచడానికి సిఎం నిర్ణయించారు. చెరువులలో చేప పిల్లలు పెంచే కార్యక్రమాన్ని అక్టోబర్ 3 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్స్య, పాడి అభివృద్ధి శాఖా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను సిఎం ఆదేశించారు. ఈ మేరకు మంత్రితో ముఖ్యమంత్రి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ పల్లెలు మరింతగా స్వయం సమృద్ధి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేసే దిశగా చేపల పెంపకం కార్యక్రమం సాగాలని సిఎం ఆకాంక్షించారు. చేపల పెంపకం వృత్తిగా గల ముదిరాజులు, బెస్తవారితో పాటు ఇతర కులాలకు చెందిన చేపల పెంపకం దారుల సొసైటీ సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని సిఎం పునరుద్ఘాటించారు. చేపల పెంపకాన్ని పల్లెల్లో ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం గుర్తిస్తున్నదని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హాయాంలో తూతూ మంత్రంగా చేపట్టిన చేపల పెంపకం కార్యక్రమం మత్స్యకారులను ఏ మాత్రం ఆదుకోలేకపోయిందన్న సిఎం అందుకు సంబంధించి గణాంక తదితర వివరాలను పరిశీలించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సహకారం నామ మాత్రంగానే వుండేదని, ఒక్కోజిల్లాలో వందలాది సొసైటీలుంటే కేవలం ఐదారు సొసైటీలకు మాత్రమే అరకొర లబ్ది చేకూరేదన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వాలు ఏనాడు చేపల పెంపకాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి ఉచిత సరఫరా చేపట్టలేదని అన్నారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మత్స్యకారులు 50% సబ్సిడీ చెల్లించాలంటే కూడా భారమైపోయేదని సిఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులను ఆదుకుని వారికి ఆర్ధికంగా లబ్దిచేకూర్చేదిశగా చేపపిల్లను 100% ఉచితంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం తెలిపారు. దీనితో పాటు మత్స్యకారులకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణనిప్పించడం, తదితర అనుబంధ శిక్షణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపడుతున్నదని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం విజయవంతంగా చేపట్టిన హరితహారం తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాల తరహాలో చెరువుల్లో చేపల పెంపకాన్ని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారిగా ఈ నెల 3వ తేది నుండి అందరి భాగస్వామ్యంతో ఉధృతంగా ప్రారంభించాలని సిఎం ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పెద్దఎత్తున పాల్గొని చేప పిల్లలను చెరువుల్లోకి వదిలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
చేపల కొనుగోలు పంపిణీ వ్యవహారాల్లో గత ప్రభుత్వాల మాదిరి ఎటువంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకతతో ఆన్ లైన్ టెండర్లను ఇటివలే పిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి తలసాని సిఎం దృష్టికి తీసుకురాగా పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.
కాగా బతుకమ్మ పండుగలో పాల్గొన్నట్టే అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న చెరువుల్లోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, చెరువుల్లో జలకళలతో పాటు చేపల కళ సంతరించుకోవాలని, సిఎం కేసిఆర్ ఆశయాలను నిజం చేసే దిశగా కదలాలని సంబంధిత శాఖామంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విజ్ఞప్తి చేశారు.
Post Comment