
*నేరం చేసింది ఎవరైనా సరే కఠిన శిక్ష
విజయనగరం: చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తు లేడు, కానీ ఇప్పుడు ఆయనకు దేవుడు గుర్తొచ్చాడని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ విమర్శించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని వారు ఆగ్రహించారు. అసలు బాబుకు దేవుడంటే నమ్మకముందా? అని సూటిగా ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయాలను కూల్చిన వ్యక్తి సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. ఇక రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు.
విగ్రహాల ధ్వంసం క్షమించరాని నేరం: మంత్రి బొత్స
దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. తమ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందని, హిందూ మత పరిరక్షణే బాధ్యతగా పనిచేస్తామని చెప్పారు. ఒకప్పుడు బీజేపీ అంటే సదభిప్రాయం ఉండేదని, ఇప్పుడది పోయిందని అన్నారు. రామతీర్థం ఘటనపై తాము ఎంతో బాధపడుతున్నామని తెలిపారు. రాముడి విగ్రహాన్ని ఇలా చేయించినవాడు అసలు మనిషేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం చేసింది ఎవరైనా సరే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.