శ్రీశైల దేవస్థానం:ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు.కాగా ఈ రోజు సాయంత్రం ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా 15 బంగారునాణెములు,18వెండినాణెములు, 3 చుట్లు గల బంగారు ఉంగరం లభించాయి.
ఇవన్నీ కూడా 1/2 ఇంచుల ఎత్తు,, 2 ఇంచుల వ్యాసముగల ఇత్తడి పాత్రలో లభించాయి.
ఘంటామఠ దక్షిణ భాగములోని గుండములో ఊట ప్రదేశములో వీటిని కనుగొన్నారు.
బంగారు నాణేములు 1880 – 1911 కాలానికి సంబంధించినవి కాగా, వెండినాణెములు 1885 – 1913 కాలానికి సంబంధించినవిగా గుర్తించారు.
వీటితో పాటు ఈ రోజు ఉదయం 1892 సంవత్సరానికి చెందిన మరో వెండి రూపాయి నాణెము కూడా విడిగా లభించింది.
కాగా నాణెములు కనుగొనిన వెంటనే స్థానిక పోలీస్, , రెవెన్యూ శాఖలకు సమాచారాన్నితెలిపారు. స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ డీన్ వారికి , రాష్టపురావస్తుశాఖ, కర్నూలు వారికి విషయం తెలిపారు.
మండల తహశీల్దార్ రాజేంద్రసింగ్, స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీంద్ర, స్థానిక పోలీస్ సిబ్బంది ఘంటామఠానికి చేరుకుని నాణెములను పరిశీలించారు.
స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షములో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీబాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ స్థపతి జవహర్, సహాయ ఇంజనీరు సురేష్ తదితరులు పంచనామా చేసి నాణేముల వివరాలను నమోదు చేశారు.