శ్రీశైల దేవస్థానం: ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా 28 రాగిరేకులు (తామ్రశాసనాలు) లభించాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులను చేపట్టింది. ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. ఈ రోజు సాయంకాలం ఘంటామఠ పునర్నిర్మాణ పనులు జరిపిస్తుండగా 28 రాగిరేకులు (తామ్రశాసనాలు) లభించాయి. ఆయా రాగిరేకులపై నాగరి, తెలుగు, ఒరియా లిపి చెక్కి ఉంది.
ఘంటామఠప్రాంగణములో ప్రధానాలయానికి ఎదురుగా గల ఆలయపు పునర్నిర్మాణ పనులలో ఈ రాగిరేకులు లభించాయి . ఆలయానికి ఉత్తరవైపు గల గోడలో రాళ్ళ మధ్య ఈ రాగిరేకులు దొరికాయి.విషయము తెలిసిన వెంటనే కార్యనిర్వహణాధికారి సంబంధిత అధికారులతో కలిసి ఘంటామఠం చేరుకుని రాగిరేకులను పరిశీలించారు.కాగా రాగిరేకులు దొరికిన వెంటనే స్థానిక పోలీస్, రెవెన్యూశాఖలకు సమాచారాన్ని అందించారు.స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీంద్ర, మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జి. రవి, స్థానిక విఆర్ఓ నాగచంద్రుడు ఘంటామఠానికి చేరుకుని రాగి రేకులను పరిశీలించారు.
రెవెన్యూ, పోలీస్ అధికారుల సమక్షములో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, సహాయ స్థపతి జవహర్, సహాయ ఇంజనీరు సురేష్ తదితరులు పంచనామా చేసి రాగిరేకుల వివరాలను నమోదు చేశారు.
ఇందులో 5 12 x 8 12 అంగుళాల సైజుగల 3 రాగిరేకులు, 6 74 x 9 4 సైజులో 3 రాగిరేకులు, 4 14 x 8 12 సైజులో 3 రాగిరేకులు, 5 x 9 74 సైజులో 3 రాగిరేకులు, 5 74 x 9 సైజులో 3 రాగిరేకులు, 6x 9 34 సైజులో 3 రాగిరేకులు, 5X 9 సైజులో 4 రాగిరేకులు, 4 4 x 9 % సైజులో 4 రాగిరేకులు 3 Y2 x 8 సైజులో 2 రాగిరేకులు మొత్తం 28 రాగిరేకులు లభించాయి.
అదేవిధంగా స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ ఆచార్యులు ప్రొఫెసరు ఆర్. చంద్రశేఖరరెడ్డి కూడా ఈ రాగిరేకులను పరిశీలించారు.