గరుడ వాహనంపై సకలలోక రక్షకుడు శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రుడు

తిరుపతి, 2021 మార్చి 06: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన శ‌నివారం రాత్రి సకలలోక రక్షకుడైన శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌రస్వామి తనకు ఎంతో ప్రీతిపాత్రమైన గ‌రుడ వాహనంపై అనుగ్రహించారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి లక్ష్మీ కాసులహారాన్ని అధికారులు ఆలయం వద్దకు తీసుకొచ్చి డెప్యూటీ ఈఓ శ్రీమతి శాంతికి అందించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. వేదాలు, ఆచార్యులు గరుడుడిని వేదస్వరూపుడిగా పేర్కొన్నారు. గరుత్మంతుని రెక్కలు వేదం నిత్యత్వానికి, అపౌరుషషేయత్వానికి ప్రతీకలని స్తుతించారు. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. ఇందుకే గరుడసేవకు ఎనలేని ప్రచారం, ప్రభావం విశిష్టత ఏర్పడ్డాయి.

ఈ కార్యక్రమంలో సివిఎస్వో  గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో  ధ‌నంజ‌యుడు, సూపరింటెండెంట్‌  చెంగల్రాయలు, టెంపుల్ ఇన్స్పెక్టర్  శ్రీనివాసులు ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సింహ‌ వాహనంపై శ్రీ సోమస్కందమూర్తి

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శ‌నివారం రాత్రి శ్రీ సోమస్కందమూర్తి సింహ వాహనంపై అభ‌య‌మిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మం ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

మృగరాజు సింహం. దేవతల్లో అత్యంత ఉత్కృష్టుడు పరమేశ్వరుడు. భక్తుల హృదయం గుహ వంటిది. ఆ గుహలో సింహం వంటి ఈశ్వరుని ఆరాధిస్తూ వుంటే  జీవుడు ఏ భయాన్ని పొందడు. మృగరాజు వంటి శివపరమాత్మ కొలువై అభయమిచ్చి జీవనాన్ని పాలిస్తుంటే, అరిషడ్వర్గాలనే క్షుద్రమృగాల భయం ఉండదు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌  భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు  రెడ్డిశేఖ‌ర్‌,  శ్రీ‌నివాస్‌నాయ‌క్‌, ఆల‌య అర్చ‌కులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed