*గజ్వేల్ లో శనివారం మిషన్ భగీరథ ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి మెహతా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషీ బృందానికి పుష్ప గుఛ్చాలతో స్వాగతిస్తున్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి. * మిషన్ భగీరథ ప్రాజెక్టు పనితీరును వివరిస్తున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి * కోమటి బండ గుట్టపై నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ నమూనాను పరిశీలిస్తున్న కేంద్ర బృందం * గజ్వేల్ మిషన్ భగీరథ పైలాన్ వద్ద అధికారులతో కలిసి గ్రూప్ ఫోటో దిగుతున్న మెహతా, జోషి తదితరులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ తాగునీటిని నల్లాల ద్వారా అందిస్తున్న మిషన్ భగీరథ కార్యక్రమం దేశానికే ఆదర్శమని కేంద్ర 15వ ఆర్థిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా అన్నారు. శనివారం ఆయన సారధ్యంలో కేంద్ర బృందం సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మిషన్ భగీరథ హెడ్ వర్క్స్, ఇతర యూనిట్లను పరిశీలించారు.ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే ఒక బృహత్తర పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వా న్ని ఆయన అభినందించారు.
ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి మాట్లాడుతూ రాష్ట్రాలకు వివిధ పద్దులకింద,అభివృద్ది పనులకు నిధులను ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేటాయించే క్రమంలో 15వ ఫైనాన్స్ కమిషన్ కార్యదర్శి రాష్ట్రానికి తొలిసారి వచ్చారన్నారు. మిషన్ భగీరధను పరిశీలించారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను కూడా చూడనున్నారన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ప్లాంట్ పైప్ లైన్లను, భారీ పైప్ లైన్లను, ఓవర్ హెడ్ టాంక్ తదితర విభాగాలను కేంద్రబృందం వారు పరిశీలించారు. ఫోటో ప్రదర్శనను కూడా అధికారులు పరిశీలించారు. ఎత్తయిన పైలాన్ వద్ద అధికారులు గ్రూప్ ఫోటోలు దిగారు. అంతకు ముందు కేంద్ర బృందానికి పుష్ప గుచ్చాలతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, గడా ప్రత్యేక అధికారి హనుమంత రావు,మిషన్ భగీరథ ఈఈ రాజయ్య, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ భాస్కర్ తదితరులున్నారు. – చైతన్య, గజ్వేల్