
*Mouli,Machilipatnam*
భారీ వర్షాల కారణంగా క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం ఆదేశించారు . కృష్ణా జిల్లాలో ఆదివారం 24 శాతం అధిక వర్ష పాతం నమోదు అయిందని కలెక్టర్ తెలిపారు . సాధారణంగా 447 మిల్లీమీటర్లు నమోదు కాగా 552 మిల్లీమీటర్లు గా నమోదు అయిందని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారన్నారు .రెవెన్యూ, పోలీస్, మెడికల్, ఇరిగేషన్ తదితర అన్ని శాఖలు సమన్వయం తో పనిచేయాలన్నారు .
వ్యవసాయ, రెవిన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పంట నష్టాల ను అంచనా వేయాలన్నారు .చట్రాయి, ముసునూరు, తిరువూరు, విజయవాడ అర్బన్ తదితర అన్ని ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు .సోమవారం ఉదయమే జిల్లా, డివిజన్, మండల స్థాయి టెలి కాన్ఫెరెన్సు నిర్వహించారు .
కృష్ణా జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అనేక మాగాణి, మెట్ట భూములు దెబ్బతిన్నాయి . తిరువూరు ప్రాంతంలో పరిస్థితి దయనీయంగా ఉంది. నియోజకవర్గంలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తిరువూరు నుంచి మల్లేల, చౌటపల్లి రహదారుల్లో ఉన్న వంతెనలపై నుంచి నీరు ప్రవహిస్తోంది.అక్కపాలెం, నునుకుళ్ల, కోకిలంపాడు రహదారి మీదుగా వాగు ప్రవహిస్తుండగా, రహదారి కోతకు గురైంది. దీంతో ఆ దారిలో వాహనాల రాకపోకలను అధికారులు, పోలీసులు నిలిపివేశారు. ఈ వరద నీరంతా మాగాణి, మెట్ట భూముల మీదుగా సాగుతోంది. వరి, పెసర, మినుము, కంది, పత్తి, మొక్కజొన్న పంటలకు బాగా నష్టం కలిగిందని, పంట నష్టాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.
భారీ వర్షాలకు విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఏపీఐఐసీ కాలనీ జలదిగ్బంధంలో ఉంది. టైలర్ పేటలోని ఆర్సీఎం పాఠశాల వెనుక గోడ కూలి ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నందిగామ మండలం దాములూరు వద్ద వైరా, మాగల్లు, కూచి వాగులు పొంగి పొరలుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో ఘంటసాలలో 18.5 మి.మీ, చల్లపల్లిలో 22.2 మి.మీ, అవనిగడ్డలో 13.7 మి.మీ కోడూరులో 12 మి.మీ, నాగాయలంకలో 11.3 మి.మీ వర్షపాతం నమోదైంది.
జోగి రమేష్ ఆగ్రహం
వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగి రమేష్ రైతన్నలతో కలిసి అర్థమూరు గ్రామం(సాతులూరు రోడ్) నీట మునిగిన వరిపంటలను పరిశీలించారు. కేవలం వరదనీరు వెళ్లే మార్గం లేకే పంటలు మునిగిపోయాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ మాట్లాడుతూ, నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని, కల్వర్టుల నిర్మాణాలలో జాప్యం వలనే వరదనీరు వెళ్లే మార్గం లేక దిగువ పంటపొలాలు మునిగి రైతులు నష్టపోయారని అన్నారు . దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించి వెంటనే నష్టపోయున ప్రతి ఎకరానికి 20 వేల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.