శ్రీశైల దేవస్థానం: ఈ నెల 16వ తేదీ నుండి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం (రూ. 150/-ల రుసుముతో), అతిశీఘ్ర దర్శనాలను (రూ. 500/-ల రుసుముతో) ఏర్పాటు ఉంది.
ఈ ఏర్పాట్లను పురస్కరించుకుని ఈ రోజు 13న కార్యనిర్వహణాధికారి ఆలయ క్యూలైన్లను పరిశీలించి సంబంధిత విభాగాలకు ఆయా ఆదేశాలు జారీ చేశారు.
కార్తీకమాసములో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న కారణంగా కరోనా నివారణ చర్యలలో పట్ల మరింత ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని కార్యనిర్వహణాధికారి అన్నారు.దర్శనాలకు విచ్చేసే భక్తులను, ఆర్జితసేవాకర్తలను ఆలయములోనికి అనుమతించేటప్పుడు కోవిడ్ నివారణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయమై ఏవిధంగా కూడా రాజీపడకూడదన్నారు.
ముఖ్యంగా దర్శనప్రవేశం ద్వారం వద్ద, ఆర్జిత సేవల ప్రవేశద్వారం వద్ద థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను తప్పనిసరిగా పరీక్షించాలని ఆలయ, భద్రతా విభాగాలను ఆదేశించారు.దర్శనానికి వేచి ఉండేందుకుగాను భక్తులను క్యూకాంప్లెక్స్ లోకి అనుమతించాలని అధికారులను సూచించారు. క్యూకాంప్లెక్స్ట్ భౌతికదూరం పాటించేవిధంగా కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ప్రసారవ్యవస్థ ద్వారా (మైక్ ద్వారా) నిరంతరం సూచనలు చేస్తూ , భక్తులకు అవగాహనను పెంపొందించాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.భక్తులు భౌతికదూరాన్ని పాటించడంలో అవగాహన కల్పించేందుకు క్యూలైన్లలో ప్రతి 25 – 30 అడుగులకు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ముఖ్య భద్రతా అధికారిని ఆదేశించారు.ఆర్జిత సేవలను నిర్వహించేటప్పుడు కూడా సేవాకర్తలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించే విధంగా సంబంధిత సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులు తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరుచుకోవడం, భౌతికదూరాన్ని పాటించడంలాంటి నియమాలను విధిగా ఆచరించేలాగా చర్యలు చేపట్టాలన్నారు.ముఖ్యంగా అన్ని క్యూలైన్లను ప్రతి రెండు గంటలకోసారి విధిగా క్రిమీసంహారకాలతో పిచికారి చేయించాలన్నారు.సామూహిక అభిషేకాలు నిర్వహించే అలంకారమండపం, కుంకుమార్చన నిర్వహించే ఆశీర్వచనమండపం, కల్యాణాన్ని జరిపే కల్యాణ మండపం, యాగశాలలు, సాక్షిగణపతి ఆలయము మొదలైనవాటిని ఎప్పటికప్పుడు అనగా ఆర్జితసేవలు ప్రారంభించేముందు, ఆర్జిత సేవలు పూర్తి అయిన తరువాత హైపో క్లోరైడ్ ద్రావణముతో శుభ్రం చేయాలని ఆలయ అధికారులను ఆదేశించారు.
ఆర్జిత టికెట్టు కౌంటర్లు, క్యూలైన్ల ప్రవేశద్వారాలు, క్యూలైన్లు, ఆర్జిత సేవలు జరిపించే స్థలాలు మొదలైన చోట్ల కోవిడ్ నివారణ చర్యల గురించి భక్తులకు అవగాహన కల్పించే విధంగా మరిన్ని ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలని కార్యనిర్వహణాధికారి శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు. సెల్ ఫోన్లు మొదలైన వాటిని ఎట్టిపరిస్థితులలోనూ ఆలయములోకి అనుమతించకూడదని కూడా భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఎవరైనా భక్తులు ప్రవేశద్వారం వద్ద సెల్ ఫోన్లతో వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వారికి ఆలయ నిభందనలను తెలియజెప్పి, సెల్ ఫోన్లను వెలుపల భద్రపరుచుకోవలసినదిగా సూచించాలన్నారు.ఆలయములోనికి బ్యాగులను అనుమతించకూడదని ఆదేశించారు. ఎవరైనా బ్యాగులను కలిగి ఉన్నప్పుడు ప్రవేశద్వారం వద్దనే వాటిని నిలుపుదల చేయాలన్నారు.ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, భద్రతా అధికారిగా విధులు నిర్వహిస్తున్న పర్యవేక్షకులు శ్రీహరి, అసిస్టెంట్ ఇంజనీర్ శివారెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.
*Ankaalamma Vishesh Pooja, Uyala Seva performed in the temple today.Archaka swaamulu performed the events with temple norms.