కోవిడ్ నియంత్రణ చర్యలపై శ్రీశైల దేవస్థానం లో ప్రత్యేక సమావేశం

శ్రీశైల దేవస్థానం:కోవిడ్ నియంత్రణ చర్యల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.  కరోనా వైరస్ విస్తరణ నివారణకు  శ్రీశైల దేవస్థానం ఎప్పటికప్పుడు  పలు చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా ఈ రోజు 12న  పరిపాలనా భవనములో కార్యనిర్వహణాధికారి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఆత్మకూరు డీఎస్పీ  వెంకటరావు, తహశీల్దార్  రాజేంద్రసింగ్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. ఎం. సోమశేఖర్, దేవస్థానం వైద్యులు డా. బాబు శివప్రకాశ్, డా. ఎన్.జె. హితేష్, దేవస్థానం వైద్యవిభాగ, భద్రతా విభాగ, శ్రీశైలప్రభ విభాగ అధికారులు కూడా ఈ సమావేశములో పాల్గొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయములో విధులు నిర్వహించేటప్పుడు భౌతికదూరం తప్పనిసరి అని కార్యనిర్వహణాధికారి అన్నారు. ఏమాత్రం ఏమరుపాటు లేకుండా ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం, భౌతిక  దూరాన్ని పాటించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం తప్పని సరి అని  సూచించారు. ఈ విషయమై దేవస్థానం ప్రచార వ్యవస్థ ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని శ్రీశైలప్రభ సంపాదకుణ్ణి ఆదేశించారు. దేవస్థానం కార్యాలయం, దర్శనం క్యూలైన్లు, దేవస్థానం అతిథిగృహాలు, దర్శనాలు, కేశఖండనశాల మొదలైన అన్నిచోట్ల కూడా తప్పనిసరిగా థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను పరిక్షించిన తరువాతనే అనుమతించాలన్నారు. ఇంకా కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ ఇప్పటికే క్యూలైన్లను శుభ్రపరచడం జరుగుతోందని, ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తుండాలని ఆలయ వైద్యవిభాగాన్ని ఆదేశించారు. రహదారులలో, ఆరుబయలు ప్రదేశాలలో జనాలు గుంపులుగా గుమికూడకుండా ఉండేందుకు అవసరమైన చర్యలతో పాటు వారిలో అవగాహన కల్పించాలని దేవస్థానం భద్రతాధికారిని ఆదేశించారు. ఆ తరువాత డీఎస్పీ వెంకటరావు మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలు పకడ్బందీగా అమలు , చేయాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. దర్శన క్యూలైన్లు, ప్రసాదాల విక్రయ కేంద్రం మొదలైనచోట్ల ఎటువంటిలోపం లేకుండా  భద్రతా చర్యలు చేపట్టాలని  సూచించారు. అదేవిధంగా ఈ విషయమై దేవస్థానం మైకు ద్వారా భక్తులలో అవగాహన కల్పించాలని సూచించారు. కల్యాణకట్ట, క్యూలైన్ల ప్రవేశం మొదలైన చోట్ల విధులు నిర్వహించే సిబ్బంది దేవస్థానం అందజేసిన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ధరించాలని కూడా సూచించారు.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులు దేవస్థానం వెబ్ సైట్ ‘Srisailamonline.com’ ద్వారా రిజిప్టేషన్ చేసుకుని దర్శనాలకు వస్తున్నారు.అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల విషయములో ఈ – పాస్ నిబంధనలను తప్పనిసరిగా పాటింపజేయాలని సమావేశములో నిర్ణయించారు.ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు రాష్ట్ర ప్రభుత్వ స్పందన పోర్టల్ ద్వారా ఈ – పాసు • పొంది, సదరు ఈ – పాస్ నెంబరును విధిగా ఆన్ లైన్ రిజిప్టేషన్ లో పొందుపర్చాలని ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా దేవస్థానం విస్తృత ప్రచారం కల్పించింది.ప్రస్తుతం దర్శనానికి ఆన్లైన్ రిజిప్టేషన్ నమోదు చేసుకునేటప్పుడు, ప్రభుత్వం నుండి పొందిన ఈ – పాస్ ను కూడా విధిగా స్కాన్ చేసి అప్ లోడ్ చేసే నిబంధనను కూడా అమలు చేయాలని సమావేశములో నిర్ణయించారు. 

అన్నప్రసాద వితరణ విభాగ పరిశీలన:

ఈ రోజు  కార్యనిర్వహణాధికారి  ఆకస్మికంగా అన్నప్రసాద వితరణ విభాగాన్ని పరిశీలించారు. ముందుగా అన్నదాన విభాగంలోని ఉద్యోగుల హాజరు నమోదును తనిఖీ చేశారు.తరువాత అన్నదాన విభాగములో అన్నదానం స్టోరు, వంటశాల, అన్నదాన విరాళాల సేకరణ కేంద్రం, మినరల్ వాటర్ పొట్లాల తయారీ మొదలైన విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా  కార్యనిర్వహణాధికారి     మాట్లాడుతూ, సిబ్బంది అందరు కూడా కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. అదేవిధంగా తరచుగా చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. వంటశాలలో విధులు నిర్వహించు వంటస్వాములు సబ్బునీటితో శుభ్రపరుచుకోవడం మంచిదని సూచించారు. ఎవ్వరు కూడా ఏమరుపాటుతో ఉండకూడదని అన్నారు.అదేవిధంగా అన్నదాన భవనాన్ని తరుచుగా శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరుస్తుండాలని అన్నారు. ముఖ్యంగా శుచిశుభ్రతపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబరచాలన్నారు.కరోనా నివారణ ముందస్తు చర్యలను సంబంధిత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలన్నారు.తరువాత వంటశాలలో ఈ రోజు అన్నప్రసాదాలకై వండిన వంటకాలను పరిశీలించారు.అదేవిధంగా ఉచిత అన్నప్రసాద పొట్లాలను అందజేసే సిబ్బంది భక్తులతో మర్యాదతతో మెలగాలన్నారు.అన్నప్రసాద పొట్లాల వితరణ గురించి కూడా భక్తుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నప్రసాద వితరణ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి వారిని ఆదేశించారు.ఉచిత ప్రసాదాల వితరణ, అదేవిధంగా ప్రసాదాల విక్రయములోనూ ఖచ్చితంగా సమయపాలనను పాటించాలని ఆదేశించారు.

అమ్మవారికి పల్లకీసేవ:

లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు  రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకి ఉత్సవం జరిపింది. ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి,  మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరుపుతారు.ఈ  కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని  తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు షోడశోపచార పూజలు జరిపారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం జరిపారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.