కోవిడ్ నిబంధనల అమలులో సమర్థవంతమైన విధులను నిర్వహించాలి

 శ్రీశైల దేవస్థానం:  కోవిడ్ నిబంధనల అమలులో   ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని ఉన్నతస్థాయిలో నిర్ణయించారు.  మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులరద్దీ అధికమవుతున్న కారణంగా కోవిడ్ నిబంధనల అమలుపై తీసుకోవలసిన ప్రత్యేక చర్యలపై చర్చించేందుకు ఈ రోజు (05.03.2021) న  అన్నప్రసాద భవన సముదాయం లోని సీసీ కంట్రోల్ రూములో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దేవస్థానం అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

 రాష్ట్ర దేవదాయశాఖ అదనపు కమిషనర్   రామచంద్రమోహన్ కూడా జూమ్ యాప్ ద్వారా ఈ సమావేశం లో పాల్గొన్నారు.

ఇటీవల  మార్చి 1వ తేదీన కేంద్ర  ప్రభుత్వ ఆరోగ్య,  కుటుంబ సంక్షేమశాఖ, కోవిడ్ నివారణకు  జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై ఈ సమావేశం లో సవివరంగా చర్చించారు.ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో దేవస్థానం చేసిన ఆయా ఏర్పాట్ల గురించి కూడా అదనపు కమిషనర్  చర్చించారు.

ముఖ్యంగా కోవిడ్ నిబంధనల పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలని అదనపు కమిషనర్  సూచించారు.  భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, క్యూలైన్ల నిర్వహణ, సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా, ప్రముఖులకు కల్పించిన విరామదర్శన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం ఏర్పాట్లు మొదలైన అంశాలను సమీక్షించారు.

జూమ్ యాప్ సమావేశం తరువాత కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామ రావు  బ్రహ్మోత్సవాలకు దేవస్థానం చేసిన ఆయా ఏర్పాట్లను పున:సమీక్షించారు. విభాగాలవారిగా ఈ పున: సమీక్షచేసారు.

 కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ భక్తులరద్దీ పెరుగుతున్న కారణంగా అన్ని విభాగాలు కూడా వారి వారి విభాగాలపరంగా సమర్థవంతమైన విధులను నిర్వహించాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఉద్యోగి కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ముఖ్యంగా కోవిడ్ నిబంధనల పట్ల సిబ్బంది అందరు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు.

కోవిడ్ నివారణ చర్యలలో భాగంగా అవసరం మేరకు థర్మల్ గన్ ద్వారా శరీర ఉష్ణోగ్రతలను పరిక్షించే ఏర్పాటు చేయాలని వైద్య,  ఆలయవిభాగాలను ఆదేశించారు.అదేవిధంగా క్యూలైన్ ప్రవేశమార్గం, ఆలయ మహాద్వారం, ఆలయం వెలుపలకు వచ్చే మార్గాలలో,  అవసరమైన చోట్ల చేతులను శానిటేషన్ చేసుకునేందుకు వీలుగా క్యూలైన్ ప్రవేశద్వారం వద్ద, మహాద్వారం వద్ద,  అవసరమైన ప్రదేశాలలో విరివిగా శానిటైజర్లను ఏర్పాటు చేయాలన్నారు. వీలైన చోట్ల లెగ్ ఆపరేటేడ్ శానిటైజేషన్ స్టాండు ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

ముందుజాగ్రత్త చర్యలలో భాగంగానే ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రపర్చడం, సమయానుకూలంగా క్యూలైన్ల పైపులు, ఆలయప్రాంగణములోని కటంజనాలు, మెట్ల మార్గంలోని రైలింగను మొదలైనవాటిని కూడా శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ చేస్తుండాలని ఆదేశించారు.

కోవిడ్ నిబంధనల చర్యలో భాగంగానే దేవస్థానం ప్రసార వ్యవస్థ ద్వారా భక్తులకు ఎప్పటికప్పుడు అవసరమైన పలు సూచనలు చేస్తుండాలన్నారు.

అదేవిధంగా ప్రజలలో అవగాహన కలిగే విధంగా అధికసంఖ్యలో ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాలలో దేవస్థానం ఏర్పాటు చేసిన ఎల్.ఈ.డి స్క్రీన్ల ద్వారా కూడా కోవిడ్ నివారణ గురించి సూచనలను ప్రసారం చేస్తుండాలన్నారు.

మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను శానిటైజేషన్ చేసుకోవడం లాంటి అంశాలపై భక్తులకు మరింత అవగాహన కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు.అదేవిధంగానే సిబ్బంది కూడా ముందుజాగ్రత్తలు పాటించాలన్నారు. సిబ్బంది అందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి విధులకు హాజరుకావాలని ఆదేశించారు.

ముఖ్యంగా అన్నప్రసాదాల వితరణ, లడ్డు ప్రసాదాల తయారీ, లడ్డుప్రసాదాలు విక్రయించే సిబ్బంది తప్పనిసరిగా చేతి తొడుగులను ధరించాలని సూచించారు. ఎండవేడిమి అధికంగా ఉంటున్నకారణంగా మరిన్నిచోట్ల కూడా చలువపందిర్లను (పైప్ పెండాల్స్ ) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దేవస్థానం పలుచోట్ల ఈ పైప్ పెండాలను ఏర్పాటు చేసారు.

భక్తులరద్దీకనుగుణంగా ఎప్పటికప్పుడు మంచినీటి సరఫరా, దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యం మొదలైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండాలని కూడా కార్యనిర్వహణాధికారి ఆయా విభాగాలను ఆదేశించారు.

print

Post Comment

You May Have Missed