రియలెస్టేట్ డెవలపర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నాం. ఇది భావి నగరం. సాంకేతికతను మేళవించి అత్యంత ఆధునిక నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. సైబరాబాద్ నగరాన్ని జతచేసి, 165 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైదరాబాద్ నగర రూపురేఖలే మార్చాం. ఈ తరహా నిర్మాణం దేశంలో మరెక్కడా జరగలేదు. దేశంలో మిగిలిన కొత్తగా నిర్మించిన రాజధానులను పరిశీలిస్తే, చండీగఢ్ పరిపాలన నగరంగానే ఉండిపోయింది. నయా రాయపూర్ దూరం, గాంధీనగర్ కూడా దూరంగానే ఉంది. ఢిల్లీ, ముంబై నగరాలు విస్తరించాయి. అమరావతి నిర్మించాలని అనుకున్నప్పుడు ప్రపంచంలో పలు అత్యుత్తమ నగరాలను పరిశీలించాం. సింగపూర్, అమ్స్టార్డ్యామ్ వంటి నగరాలకు లేని ఫ్రెష్ వాటర్ అమరావతి సొంతం. ఇక్కడి ప్రజానీకం డైనమిక్‌గా ఉంటారు. బుల్లెట్ రైలు తీసుకువద్దామనుకుంటే ఢిల్లీలో భూ సేకరణ ప్రధాన అడ్డంకిగా ఉంది. అలాంటిది 35 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చాయి. కొత్త నగరంలో మీకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములవ్వండి. 2 వేల ఎకరాల మేర ద్వీపాలు కృష్ణానదిలో అమరావతికి ఆనుకుని ఉన్నాయి. రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో ఉన్న చెరువులన్నీ నీటితో కళకళలాడేలా చర్యలు తీసుకుంటున్నాం. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఈ నగర ప్రత్యేకత. మూడు కాల్వలతో ఉన్న విస్తరించిన విజయవాడ నగరం అమరావతికి జంట నగరం. ఇదే కాకుండా సమీపంలోనే ఉన్న గుంటూరు నగరాన్ని కూడా కలుపుకుని రానున్న కాలంలో ఇది మహానగరంగా మారనుంది. దేశంలో ఉన్న తొలి 10 రియలెస్టేట్ దిగ్గజాలు ఇక్కడ నిర్మాణాలను చేపట్టాలి. రండి, ఒక్కొక్కరూ కనీసం ఒక్కొక్క నిర్మాణాన్ని చేపట్టండి. ఐకానిక్ నిర్మాణాలతో మీ సంస్థల ప్రతిష్ఠను పెంచడమే కాకుండా అమరావతికి కీర్తి ప్రతిష్టలు తీసుకురండి.
అమరావతిలో ఐటీ కంపెనీలకు ఐదేళ్లు ఉచితంగా ఆఫీసు స్పేస్ అందిస్తే ఎన్నో సంస్థలు ముందుకురావడమే కాకుండా పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని సమావేశంలో రియలెస్టేట్ ప్రతినిధి ఒకరు చేసిన సూచనను పరిశీలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు .