కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై టీఆర్ఎస్ పార్టీ నాయకులతో చర్చించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు జరగాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలోని నాయకులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని సిఎం నిశ్చయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల నాయకులతో, సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ నాయకులతో ముఖ్యమంత్రి చర్చలు జరుపుతారు. హైదరాబాద్ లోని సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలని ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్లు, డిసిఎంఎస్ చైర్మన్లు, డిసిసిబి చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులను కోరారు.