శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి (04.03.2021) నుండి జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు 14.03.2021 వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని వివిధ ఏర్పాట్లను చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలు జరుగుతాయి.
కాలిబాట మార్గంలో అటవీశాఖ సహకారం తో భక్తుల సౌకర్యార్థం వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ రోజు (03.03.2021) న కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, అటవీశాఖ అధికారులు, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వెంకటాపురం, నాగలూటి తదితర కాలిబాట మార్గాలను పరిశీలించారు.ఈ పరిశీలనలో ఆత్మకూరు డి.ఎఫ్.ఓ. కిరణ్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎస్. చంద్రశేఖర్, నాగలూటి రేంజ్ ఆఫీసర్ ఎస్.రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి కాలిబాటమార్గములో మంచినీటి సదుపాయం, అన్నదానం చేసే భక్తులకు అందించనున్న సహాయ సహకారాలు, కాలిబాట మార్గములో మార్గసూచికల ఏర్పాటు, వైద్యశిబిరాల ఏర్పాటు మొదలైన అంశాల గురించి అటవీ అధికారులు , కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.
కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, అవసరమైనచోట వైద్యశిబిరాల ఏర్పాటు మొదలైనవి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
కాలిబాటతో వచ్చే భక్తులు ప్రధానంగా కాలిబొబ్బలు, ఒళ్లు నొప్పులు మొదలైన ఇబ్బందులతో బాధపడుతుంటారు. అందుకే ఈ వైద్యశిబిరాలలో ఈ సమస్యలకు సంబంధించిన పూతమందులు ( ఆయింట్ మెంట్) మాత్రలు మొదలైనవి అందుబాటులో ఉంటాయి. జిల్లా వైద్యశాఖ వారి సహకారం తో ఈ వైద్యసేవలకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు.
అదేవిధంగా కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు ఇప్పటికే చలువ పందిర్లను (షెడ్డు) వేసారు.
కైలాసద్వారం నుండి భీమునికొలను వరకు తాత్కాలికంగా పైలైన్ వేసి నీటి సరఫరాను కూడా కల్పించారు. కైలాసద్వారం – భీమునికొలను మధ్యమార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల సింటెక్స్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేసారు. ఈ మార్గములో 6 చోట్ల ఈ ట్యాంకులను ఏర్పాటు చేసారు.ఇంకనూ కైలాసద్వారం వద్ద 5000 సామర్థ్యం గల మరో ఆరు సింటె ్యంకులను ఏర్పాటు చేసారు.
ఈ సింటెక్స్ ట్యాంకులకు, కైలాసద్వారం వద్ద గల 20 వేల లీటర్ల సామర్థ్యపు ఆర్.సి.సి నీటి ట్యాంకునకు కూడా నిరంతర మంచినీటి సరఫరా చేస్తారు.
మొత్తం మీద కైలాసద్వారంలో నిరంతరం 50వేల లీటర్ల నీరు నిల్వ వుండేలా ప్రణాళికలను రూపొందించి, తదనుగుణంగా చర్యలు తీసుకున్నారు. కైలాసద్వారం వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి తాత్కాలిక విద్ద్యుద్దీకరణ ఏర్పాటు చేసారు.