ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు గారిలా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం లేదన్నారు BHEL ప్రతినిధులు. విద్యుత్ రంగంతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టుకు అవసరమైన ఎలక్ట్రో, మెకానికల్ యంత్రాల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐన BHEL ను సంప్రదించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ గారి చొరవతో ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ప్రజల్లో ధృడ విశ్వాసం ఏర్పడిందన్నారు. మిషన్ భగీరథ కు అవరసరమైన పంపులు, మోటార్లను BHEL నుంచి కొనాలన్న ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆ సంస్థ ఉన్నతాధికారులతో వైస్ ఛైర్మెన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలోని తన కార్యాలయంలో సమావేశమయ్యారు.
ముందుగా ప్రాజెక్టు లక్ష్యం, పనుల పురోగతిని బీహెచ్ఈఎల్ ప్రతినిధులకు ప్రశాంత్ రెడ్డి వివరించారు. లేటెస్ట్ వీడియోలు, ఫోటోలతో ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును తెలియచేశారు.20 ఏళ్ల క్రితం సిద్దిపేట ప్రజలకు మానేరు నీటిని అందించిన అనుభవంతో ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ ను ప్రారంభించారని చెప్పారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న కేసీఆర్ గారు, కాంటూర్ల ఆధారంగా ప్రాజెక్టును డిజైన్ చేయించారన్నారు. సిఎం గారి సూచనలు, సలహాలతో గ్రామీణ నీటి సరాఫరా విభాగం ఇంజనీర్ల ఆధ్వర్యంలోనే ప్రాజెక్టు సమగ్ర స్వరూపం తయారైందన్నారు. స్వరాష్ట్రం కోసం అరవై ఏళ్లు పోరాడిన తెలంగాణ ప్రజల నీటి గోసను శాశ్వతంగా తీర్చాలన్న ఆశయంతో 26 సెగ్మెంట్లలోని దాదాపు 250 ప్రదేశాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయన్నారు.
సివిల్ వర్క్స్ మొదలైన 9 నెలల్లోనే 10 వేల కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయని, దాదాపు 6 వేల కోట్ల రూపాయల బిల్లులను చెల్లించామన్నారు. ఒక ప్రభుత్వ ప్రాజెక్టులో ఇంత స్పీడ్ గా పనులు జరగడం, బిల్లులు చెల్లించడం ఇంతకుముందెక్కడా జరగలేదన్నారు. దేశంలోని ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు, బ్యాంకులు భగీరథ కు రుణాలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాటర్ గ్రిడ్ ను పూర్తి చేయడానికి అక్కడి ప్రభుత్వానికి 13 సంవత్సరాల సమయం పట్టిందని, తాము మాత్రం మూడున్నరేళ్లలోనే తెలంగాణలోని పల్లెపల్లెకు రక్షిత మంచినీటిని ఉచితంగా అందించడమే లక్ష్యంగా పనులు ప్రారంభించామని గుర్తుచేశారు.ఈ లక్ష్య సాధనలో మిషన్ భగీరథ అధికారులు, వర్క్ ఏజెన్సీలు పగలు,రాత్రీ అన్న తేడా లేకుండా కష్టపడుతున్నారని ప్రశంసించారు.
ఆ తర్వాత మాట్లాడిన బీహెచ్ఈఎల్ ప్రతినిధులు, తాము కూడా మిషన్ భగీరథ గురించి తరుచుగా వింటున్నామన్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికి దేశానికే రోల్ మోడల్ లాంటి ప్రాజెక్టును తెలంగాణ చేపట్టిందని ప్రశంసించారు. విద్యుత్,సాగునీరు, తాగునీరు, సంక్షేమ రంగాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికున్న ఆలోచనలు ఆయన దార్శనికతను తెలియచేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలన్న సదాశయంతో కేసీఆర్ గారు తమకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్దితో పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథకు అవసరమైన మోటార్ల సామర్థ్యం, సంఖ్యపై అధికారులు చర్చించారు. 227 పంపింగ్ స్టేషన్లలో 10 నుంచి 2900 HP సామర్థ్యం కల 1066 మోటార్లు కావాలని RWS&S ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రజలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంగా భగీరథ పనులు సాగుతున్నాయన్న ప్రశాంత్ రెడ్డి, అందుకు అనుగుణంగా తమకు మోటార్లను సప్లయ్ చేయాలన్నారు. గవర్నమెంట్ టూ గవర్నమెంట్ పద్దతిలో ఈ పనులు చేయాలన్నారు.
ఈ సందర్భంగా బీహెచ్ఈఎల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్న వైస్ ఛైర్మెన్, తమ యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగా మోటార్లు ఇవ్వడానికి ఏం చేస్తారో చెప్పాలన్నారు. తమపై తెలంగాణ ప్రభుత్వం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలన్న బీహెచ్ఈఎల్ బృందం, త్వరలోనే సమగ్రమైన ప్రొడక్షన్ ప్లాన్ తో కలుస్తామన్నారు. ఈ సమావేశంలో RWS&S ఈఎన్.సి సురేందర్ రెడ్డి, RWS&S ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్, OSD సత్యపాల్, కన్సల్టెంట్ మనోహర్ బాబు,BHEL జనరల్ మేనేజర్లు నరేంద్ర కుమార్, జి.కె. హెడూ,అడిషనల్ జనరల్ మేనేజర్ పంకజ్ రస్తోగీ, మార్కెటింగ్ సూపర్ స్పెషలిస్ట్ గోపాలక్రిష్ణన్ పాల్గొన్నారు.