కేరళ లోని ఎర్నాకులం జిల్లా పంచాయతి, పరక్కడావు బ్లాక్ పంచాయతి, శ్రీ మూల నగరం గ్రామ పంచాయతి లను సందర్శించిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
దేశానికే ఆదర్శంగా కేరళ స్థానిక పాలన
తెలంగాణాలోనూ స్థానిక సంస్థలకు పెద్దపీట
పారిశుద్ధ్యం, వర్షపు నీటి వినియోగం, రోడ్ల నిర్మాణంలో నాణ్యతపై కేరళ స్థానిక ప్రతినిధులను అభినందించిన మంత్రి
కేరళలోని కుదుంబశ్రీ తరహాలోనే తెలంగాణాలోనూ పేదరిక నిర్మూలనకు కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది
షాదీముభారక్, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్ రూం ఇండ్లలాంటి పథకాలపై కేరళ ప్రతినిధుల ఆసక్తి
రెండు రోజుల పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
కేరళ లోని పంచాయతీ పాలన విధానం దేశానికే ఆదర్శమని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశంసించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం కేరళ లోని ఎర్నాకులం జిల్లా పంచాయతి, పరక్కడావు బ్లాక్ పంచాయతి, శ్రీ మూల నగరం గ్రామ పంచాయతి లను మంత్రి జూపల్లి కృష్ణారావు బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కేరళలో అమలు చేస్తున్న పథకాల అమలు తీరుపై తెలంగాణా బృందం పలు అంశాలను అడిగి తెలుసుకుంది. కేరళలో పారిశుద్ద్య నివారణ చర్యలు… వర్షపునీటి సద్వినియోగం… వ్యక్తిగత పారిశుద్ద్యంపై పంచాయతీల పాలకవర్గాలను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన తొలి జిల్లాగా గుర్తింపు పొందిన ఎర్నాకులంలో విద్యావ్యవస్థ తీరును ప్రత్యేకంగా పరిశీలించారు.
తెలంగాణలోని పంచాయతి వ్యవస్థపై ఎర్నాకులం జిల్లా పంచాయతి సభ్యులు అసక్తి చూపారు. తెలంగాణా స్థానిక ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ప్రభుత్వం గౌరవ వేతనాలను పెంచడంపై ఎర్నాకులం జిల్లా పంచాయతీ సభ్యులు మంత్రిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణాలో పర్యటనకు రావాలని మంత్రి వారిని ఆహ్వానించారు. అనంతరం పరక్కాడాపు బ్లాక్ పంచాయతీని మంత్రి సందర్శించారు. పాలకవర్గం, సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై అభివృద్దిలో బ్లాక్ పంచాయతీల పాత్రపై చర్చించారు. తమ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపట్టిన కుదుంబశ్రీ పథకాన్ని మంత్రికి వివరించారు. ఇదే తరహాలో తెలంగాణాలో సెర్ప్ ద్వారా చేపడుతున్న పేదరిక నిర్మూలన కార్యక్రమాలను మంత్రి జూపల్లి తెలిపారు. షాదీముభారక్, కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ద్వారా బీపీఎల్ కుటుంబాలకు తాము ఇస్తున్న చేయూతను మంత్రి వివరించారు. ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే 16 వ అనుమతి వచ్చినట్టే అని మంత్రి తమ నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించగా…దీనిపై వారు ప్రశంసల జల్లు కురిపించారు.
శ్రీమూల నగరం పంచాయతీ సందర్శన
తమ గ్రామాన్ని సందర్శించాలని కొచ్చి ఎయిర్ పోర్ట్ ఉన్న శ్రీ మూల నగర పంచాయతి సభ్యులు మంత్రి జూపల్లిని కలిసి కోరారు. వారి విజ్జ్ఞప్తి మేరకు ఆ గ్రామాన్ని సందర్శించారు మంత్రి. గ్రామంలోని రహదారులను… ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. ప్రతి ఇంట్లో కంపోస్ట్ తయారి, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవడంపై అభినందించారు.
మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో బేటీ
మాజీ ముఖ్యమంత్రి ఊమన్ చాందీతో మంత్రి జూపల్లి కృష్ణారావు బేటీ అయ్యారు. తెలంగాణా, కేరళల్లోని పంచాయతీరాజ్ వ్యవస్థల మధ్య ఉన్న వ్యత్యాసంపై చర్చంచారు. రెండు రోజుల కేరళ పర్యటన ముగించుకుని శనివారం రాత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ హైదరాబాద్ చేరుకున్నారు