
సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాకు చెందిన జర్నలిస్టులకు జనవరి 9వ తేదీన (శనివారం) శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 01.00 గంట వరకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనవిడుదల చేశారు. శిక్షణ తరగతులను కర్నూలు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జర్నలిజంలో అపారమైన అనుభవంతోపాటు యూనివర్సిటీల్లో సుదీర్ఘకాలంగా ఆచార్యులుగా పనిచేస్తున్న నిష్ణాతులు వివిధ అంశాలపై మాట్లాడతారని తెలిపారు. గ్రామీణ ప్రాంత విలేకరులతోపాటు అన్ని స్థాయిల వారికి ఉపయుక్తంగా ఉండేలా తరగతులు నిర్వహించ నున్నామని వివరించారు. నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా|| ఎల్.విజయకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు.ప్రారంభ సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి. వీరపాండ్యన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు దేవులపల్లి అమర్ విశిష్ట అతిథిగా, కర్నూలు రేంజి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిఐజి) పి. వెంకటరామిరెడ్డి ప్రత్యేక అతిథిగా ప్రసంగిస్తారని దేవిరెడ్డి శ్రీనాధ్ వివరించారు. శిక్షణలో భాగంగా ‘సైన్స్ జర్నలిజంలో గ్రామీణ జర్నలిస్టుల పాత్ర’ అంశంపై తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం జర్నలిజంశాఖ ఆచార్యలు పి. విజయలక్ష్మి, ‘పాత్రికేయులు- సామాజిక బాధ్యత’ అనే అంశం పై విశాఖపట్టణంలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం జర్నలిజంశాఖ విశ్రాంత ఆచార్యలు బాబీవర్ధన్ ప్రసంగిస్తారని వివరించారు. స్టడీమెటిరియల్ జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఆన్ లైన్ ద్వారా పంపుతామని ఛైర్మన్ శ్రీనాధ్ తెలిపారు. వార్త అంటే ఏమిటి?, కథనాలు రాయడం ఎలా?, టి.వి. రిపోర్టర్ ఇలా ఉండాలి, క్రైమ్ బీట్ పై ఫోకస్, తప్పులు రాయవద్దు తదితర పది అంశాల పై రూపొందించిన బుక్ లెట్స్ పిడిఎఫ్ ఫాంలో మెటిరియల్ మెయిల్ ఐడీలకు పంపుతామని వివరించారు. తరగతులకు హాజరైన జర్నలిస్టులకు అదేరోజు సాయంత్రం ఆన్లైన్లో సర్టిఫికెట్లు కూడా పంపుతామని తెలిపారు.