
కర్నూలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గురువారం కర్నూలు ఎయిర్‌పోర్టును ప్రారంభించారు. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్‌పోర్టును ప్రారంభించి.. జాతికి అంకితమిచ్చారు. ఈనెల 28వ తేదీ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ సభను జ్యోతిప్రజ్వలన చేసిన ప్రారంభించిన సీఎం.. కర్నూలు ఎయిర్‌పోర్టు శిలాఫలకాన్ని ప్రారంభించారు.
కర్నూలు చరిత్రలో ఈ రోజు ఎప్పటికీ నిలిచిపోతుందని, ఇంత వరకు రోడ్డు, రైలు మార్గాలే అందుబాటులో ఉండే ఈ జిల్లాలో ఇకమీదట నుంచి విమానప్రయాణం కూడా జరగబోతుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏడాదిన్నరలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును పూర్తిచేశామని చెప్పారు. తొలి దశ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నివాళిగా.. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేస్తున్నట్లు సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభి.. జాతికి అంకితమిచ్చిన అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. సీఎం మాటల్లో …
‘ఈనెల 28వ తేదీ నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఒకేసారి నాలుగు విమానాలు పార్కు చేసుకునే విధంగా ఎయిర్‌పోర్టులో సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చాం.
ఆరవ ఎయిర్‌పోర్టు..
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఐదు విమానాశ్రయాలు ఉంటే.. ఇది 6వ విమానాశ్రయం కాబోతుంది. తిరుపతి, కడప, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఈ కర్నూలు ఎయిర్‌పోర్టుతో ఆరవ విమానాశ్రయం ప్రారంభం . ఈ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు మనందరం నిర్మించుకోబోతున్న న్యాయరాజధానిలో మిగతా ప్రాంతాలు, మిగతా రాష్ట్రాలను కలిపే ఎయిర్‌పోర్టుగా నిలబడుతుంది.
పట్టుదలతో రూ.110 కోట్లు ఖర్చు చేసి..
కర్నూలులో ఇదే విమానాశ్రయం కచ్చితంగా రావాలని, పట్టుదలతో కోట్లు ఖర్చు చేసి.. పనులు చేయించి కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే ప్యాసింజర్ టర్మినల్ బిల్డింగ్, ఐదు ఫోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, ట్యాంక్, సబ్స్టేషన్లు, రన్‌వేలోని బ్యాలెన్స్ పనులు ఇవన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయగలిగామని ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇదొక్కటే కాకుండా ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న రెండు అధునాత అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడే అందుబాటులో ఉంచడం జరుగుతుంది.
మంత్రికి, అధికారులకు అభినందనలు..
ప్యాసింజర్ టర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీకేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అనుమతులు తెప్పించడంలో, ఎయిర్‌పోర్టుకు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేయడంలో మన మంత్రి, అధికారులు ఎంతగానో పనిచేశారని, వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన యోధుడికి నివాళిగా..
నా ప్రసంగం ముగించే ముందు ఒక్క విషయం కచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. భారత జాతీయ కాంగ్రెస్ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీజీ మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో మొట్టమొదట సత్యాగ్రహం చంపవరం (బిహార్)లో జరిగింది. వీటన్నింటికంటే ముందు ఈ కర్నూలు గడ్డ మీద స్వాతంత్య్రానికి వంద సంవత్సరాల ముందే మొదటి స్వాతంత్య్ర పోరాటం అని చెప్పి చరిత్రకారులు 1857లో జరిగిన సిపాయి తిరుగుబాటు కంటే ముందే 1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన ఒక మహా స్వాతంత్య్ర సమరయోధుడు.. ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆ యోధుడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఆయనకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను.
మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు..
దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇటీవలే పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అందరి హృదయాల నుంచి మద్దతు పలికారు. మీ కోసం మరింతగా పనిచేస్తానని ప్రతి ఒక్క అక్కచెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, స్నేహితుడికి నిండు మనస్సుతో తెలియజేస్తున్నాను’ అని సీఎం వైయస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
ఓర్వకల్లు ఎయిర్ పోర్టు చిత్రం కలిగిన పోస్టల్ కవర్‌ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. గురువారం ఎయిర్ పోర్టును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతుల మీదుగా ప్రత్యేకంగా రూపొందించిన పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారంటే కచ్చితంగా చేస్తారని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ..గతంలో ఉన్న నాయకులను చూశాం. ఎన్నికల కోసమే ఓర్వకల్లు ఎయిర్ పోర్టును అరకొరగా నిర్మించి వదిలేశారన్నారు. వైయస్ జగన్ ఒక్కటే చెప్పారు. ప్రజల ముందు ఏ మాట అయితే చెబుతామో..అది నెరవేర్చాలన్నారు. మనం అన్ని పనులు పూర్తి చేసిన తరువాతే ఎయిర్ పోర్టును ప్రారంభిస్తామన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించి, అవసరమైన నిధులు మంజూరు చేయించి త్వరితగతిన ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తి చేయించారన్నారు. అందరి నాయకులకు.. మన నాయకుడికి ఉన్న తేడా ఇదే అన్నారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కోరుకునే నాయకుడు మన అందరి నాయకుడు వైయస్ జగన్. ఈ నెల 28వ తేదీ నుంచి ఈ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఓర్వకల్లుకు సంబంధించిన మల్లికార్జున రిజర్వాయర్‌ను త్వరగా పూర్తి చేయించాలని సీఎంను కోరారు. సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలతో ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైయస్ఆర్సీపీ కైవసం చేసుకుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టలేదని చెప్పారు. సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు ఉయ్యలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ముఖ్యమంత్రికి కోరారు.
కర్నూలు/ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఈ రోజు మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయాన్ని లాంఛనంగాప్రారంభించడంతో అంతా ఆనందం వ్యక్తమైంది.
జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బి.వై రామయ్య, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, కర్నూల్ నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజీ, డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.ఉదయం 11 గంటల 45 నిమిషాలకు కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు .వైయస్ జగన్మోహన్ రెడ్డి కి కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ DIG వెంకట్రామిరెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరాం mLC గంగుల ప్రభాకర్ రెడ్డి నంద్యాల పార్లమెంట్ సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి విమానాశ్రయ ప్రతినిధులు తదితరులు పుష్పగుచ్ఛాలు తో స్వాగతం పలికారు.