విజయవాడ, సెప్టెంబర్ 18న కర్నూలు జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పాల్గొన్న అన్ని కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి సంతోషం వ్యక్తం చేసారు . ఈ మేరకు ఏపిసిసి రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
మొదటిగా ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, దేశంలోనే మొదటి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య స్వగ్రామం పెద్దపాడును సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంజీవయ్య నిజాయితీని బహిరంగాగ సభలో గుర్తు చేసిన రాహుల్ గాంధీ సంజీవయ్య లాంటి నీతి, నిజాయితీ ఉన్న నాయకత్వం కాంగ్రెస్ అందిస్తుందని చెప్పడం ఎంతో స్ఫూర్తి నింపింది.
బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థి, యువజనులతో జరిపిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు రాహుల్ గాంధీ స్పందించిన తీరు, చెప్పిన సమాధానాలు విద్యార్థులను సంతృప్తి పరచాయని ఆనందం వ్యక్తం చేయడం, ఈ తరానికి రాహుల్ గాంధీ నాయకత్వం కావాలని యువత భావిస్తున్నారని అర్థం ఆవుతోంది.
మాజీ ముఖ్యమంత్రి, దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులు అర్పించడంతోపాటు అక్కడ రైతులతో కొద్దిసేపు మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం ..బహిరంగ సభలో రైతాంగాన్ని ఆదుకునేందుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని భరోసా ఇవ్వడం రైతాంగం లో నమ్మకం, సంతోషం వ్యక్తం అవుతోంది.
దళిత నేత దివంగత బాబుజగజ్జీవన్ రాం విగ్రహానికి నివాళులర్పించి.. తర్వాత “సత్యమేవ జయతే బహిరంగ సభ” లో పాల్గొన్న రాహూల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదా హక్కు అని..2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలిసంతకం తో అమలుచేస్తామని స్పష్టం చేయడం పట్ల 5 కోట్ల ఆంద్రప్రదేశ్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చి రాహుల్ గాంధీ సభను విజయవంతం చేశారు. వారందరికీ ఏపీసీసీ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.కర్నూలు లో జరిగిన రాహుల్ గాంధీ కార్యక్రమాలన్నింటినీ జయప్రదం చేయడంలో శ్రమించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ చేపట్టిన కర్నూలు కార్యక్రమాలన్నీ జయప్రదం అయ్యేందుకు సహకారాన్ని అందించిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు .