కర్నూలు: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని నిరసిస్తూ రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. విభజన చట్టంలోని హామీల్లో ఏ ఒక్కదానికి తగిన కేటాయింపులు లేవని నిరసనకు దిగాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం తెలుగుతల్లి సాక్షిగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కేంద్ర బడ్జెట్ పై ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినా కర్నూలులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రోజు ముందుగానే కదం తొక్కాయి. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ముస్లిం మైనారిటీ, వర్తక, వాణిజ్య, విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం, మోడీ డౌన్ డౌన్, బీజేపీ నిరంకుశ పాలన నశించాలి అంటూ నినాదాలు చేస్తూ కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సెల్ ఛైర్మన్ అహ్మద్ అలిఖాన్ మాట్లాడుతూ కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ కూడా ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని మాట మార్చారని ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఊహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడో నెలలోనే ప్రత్యేక హోదా కోసం కోటి సంతకాల కార్యక్రమం చేపట్టి ఇప్పటికీ నిరంతరం పోరాడుతోందని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అహమ్మద్ అలిఖాన్ పేర్కొన్నారు. ఎంపీలు కేంద్రానికి మద్దతు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.మదనగోపాల్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, ఐఎన్టీయూసీ నాయకులు వై.వి.రమణ, నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జ్ అశోకరత్నం, డీసీసీ కార్యదర్శి రాంబాబు, మహిళా కాంగ్రెస్ నాయకులు పి.సుజాత, సూర్యకాంతమ్మ, సారమ్మ తదితరులు పాల్గొన్నారు.