×

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా శ్రీశైల దేవస్థానం లో మరో వారం రోజులపాటు స్వామిఅమ్మవార్ల దర్శనాలు నిలిపివేత

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా శ్రీశైల దేవస్థానం లో మరో వారం రోజులపాటు స్వామిఅమ్మవార్ల దర్శనాలు నిలిపివేత

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర పరిధిలో పలువురికి కరోనా నిర్ధారణకావడంతో స్థానిక తహశీల్దార్  శ్రీశైలాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.శ్రీశైలక్షేత్రం కంటైన్మెంట్ జోన్  కారణంగా  మరో వారం రోజులపాటు ఆలయంలో  దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు  .కాగా ఈ రోజు 21 న  కరోనా నిర్ధారణ  అయిన వారిలో  8 మంది దేవస్థానం సిబ్బంది కూడా ఉన్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా మరో వారం రోజులపాటు  దర్శనాలు నిలిపివేయాలనినిర్ణయించారు.

ఈ విషయమై స్థానిక తహశీల్దార్,  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో సంప్రదించి, వారి సూచనల మేరకు , రాష్ట్ర దేవదాయ కమి షనర్,  జిల్లా కలెక్టర్  అనుమతిని పొంది ప్రస్తుతం తాత్కాలికంగా మరో ఏడు రోజులపాటు దర్శనాలు నిలుపుదల చేసారు.వారం రోజుల తరువాత అప్పటి పరిస్థితులను బట్టి తదుపరి చర్యలపై తగు నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 14వ తేదీన పలువురు దేవస్థానం సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో  ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నెల 15వతేదీ నుంచే ఆలయాలలో దర్శనాలను నిలుపుదల చేసారు.

యథావిథిగా స్వామి అమ్మవార్ల కైంకర్యాలు:

భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ నిత్యం జరిగే శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యాలన్నీ యథావిథిగా నిర్వహిస్తారు. లోకకల్యాణం కోసం జరిపే దేవస్థానం సేవలైన (సర్కారి సేవలైన) సహస్ర దీపాలంకరణ సేవ, నంది సేవ, శ్రీస్వామిఅమ్మవార్ల ఊయల సేవ, పల్లకీసేవ, గ్రామదేవత అంకాళమ్మపూజ, క్షేత్రపాలకుడైన బయలువీరభద్రదస్వామిపూజ, కుమారస్వామిపూజ, దత్తాత్రేయపూజ మొదలైనవన్నీ యథావిధిగా ఆయా రోజులలో జరుపుతారు.

పరిమిత సంఖ్యలో అర్చకస్వాములు, పరిచారకులు తగు ముందు జాగ్రత్తలతో నిత్య కైంకర్యాలను, సర్కారి సేవలను నిర్వహిస్తారు.

అయిదు రోజులపాటు జరిగిన  శీతలాదేవి హోమం:

 అయిదు రోజులపాటు  ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శీతలా దేవి హోమం జరిగింది . ఈ ఐదు రోజులలో శీతలాజపం, మహా విద్యాపారాయణలు, వేదసూక్తపారాయణలు కూడా చేసారు. దేవస్థానం వేదపండితులు ఈ జపపారాయణలను చేసారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులు తొలగిపోయి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలనే సంకల్పముతో హోమము, జపపారాయణలు జరిపారు.

మహామృత్యుంజయ మంత్ర జపం:

 అందరూ ఆరోగ్యంగా వుండాలనే సంకల్పముతో ఆలయములో మహామృత్యుంజయ మంత్ర జపాలు కూడా తిరిగి ప్రారంభమయ్యాయ.

గత మార్చి – ఏప్రియల్ మాసాలలో కూడా 41 రోజులు ఈ మృత్యుంజయమంత్ర జపాలు జరిగాయి.

 ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితులు తొలగేందుకు శ్రీమల్లికార్జునస్వామివారికి ప్రత్యేకంగా ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేస్తున్నారు.

పదకొండు మంది అర్చకస్వాములు ఏకకాలములో రుద్రమంత్రాలు పఠిస్తూ ఈ అభిషేకాలను నిర్వహిస్తున్నారు.

పరోక్షసేవలు కొనసాగింపు:

ఆలయములో దర్శనాలు నిలుపుదల చేసినప్పటికీ భక్తుల సౌకర్యార్ధం పరోక్షసేవలు  యథావిధిగా కొనసాగుతాయి.

భక్తులు ఆన్లైన్ ద్వారా సేవా రుసుము రూ. 1,116/-లు చెల్లించి, వారి గోత్రనామాలతో పరోక్షసేవలను జరిపించుకోవచ్చు.

స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, చండీ హోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వరకల్యాణం, శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్లకల్యాణం, స్వామివార్ల ఏకాంతసేవలను,  వేదాశీర్వచనాన్ని (మొత్తం 10 సేవలు) వారి గోత్రనామాలతో చేయించుకోవచ్చు.

క్యూ.ఆర్. కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి.హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా కూడా సేవా రుసుమును చెల్లించవచ్చు.

కాగా ఈ పరోక్షసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. భక్తులు ఈ ప్రసారాలను యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.

 స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లేదు.  ఈ అభిషేక, కుంకుమార్చనల సేవాకర్తలకు, వారిసేవ అయిన  సాయంత్రం వేదాశీర్వచనాన్ని అందిస్తారు. ఈ ఆశీర్వచనం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఇతర వివరములకు దేవస్థానం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53/54/55/ 56 లను సంప్రదించవచ్చును.

print

Post Comment

You May Have Missed