శ్రీశైల దేవస్థానం:శ్రీశైల క్షేత్రపరిధిలో పలువురికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా సోకినవారిలో ఇద్దరు ఆలయపరిచారకులు , ముగ్గురు దేవస్థాన భద్రతా (సెక్యూరిటీ) సిబ్బంది కూడా ఉన్నారు.ఈ కారణంగా క్యూ కాంప్లెక్సును, క్యూలైన్లను, ఆలయ ప్రాంగణాన్నంతా కూడా శాస్త్రీయ పద్దతిలో శానిటైజేషన్చేస్తున్నారు. ఈ కారణంగా రేపటి (15.07.2020) నుంచి వారం రోజులపాటు భక్తులకు స్వామివార్ల దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు.శ్రీశైల క్షేత్ర పరిధిలో కరోనా వ్యాప్తి పరిస్థితులను దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు తెలిపారు . దేవాదాయశాఖ కమిషనరు వారి అనుమతిని పొంది తాత్కాలికంగా ఏడు రోజులపాటు దర్శనాలను నిలిపివేశారు.
యథావిథిగా స్వామి అమ్మవార్ల కైంకర్యాలు:
భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ నిత్యం జరిగే శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యాలన్నీ యథావిథిగా జరుగుతాయి.
అదేవిధంగా లోకకల్యాణం కోసం జరిపే దేవస్థానం సేవలైన (సర్కారిసేవలైన) సహస్ర దీపాలంకరణ సేవ, నందిసేవ, శ్రీస్వామిఅమ్మవార్ల ఊయలసేవ, పల్లకీ సేవ, గ్రామ దేవత అంకాళమ్మపూజ,క్షేత్రపాలకుడైన బయలువీరభద్రదస్వామిపూజ, కుమారస్వామిపూజ, దత్తాత్రేయపూజ మొదలైనవన్నీ యథావిధిగా ఆయా రోజులలో జరుగుతాయి.పరిమిత సంఖ్యలో అర్చకస్వాములు, పరిచారకులు తగు ముందు జాగ్రత్తలతో నిత్య కైంకర్యాలను, సర్కారి సేవలను నిర్వహిస్తారు.
పరోక్షసేవలు కొనసాగింపు:
ఆలయములో దర్శనాలు నిలుపుదల చేసినప్పటికీ భక్తుల సౌకర్యార్ధం పరోక్షసేవలను యథావిధిగా కొనసాగుతాయి.
భక్తులు ఆన్‌లైన్ ద్వారా సేవా రుసుము రూ. 1,116/-లు చెల్లించి, వారి గోత్రనామాలతో పరోక్షసేవలను జరిపించుకోవచ్చు.
స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, గణపతిహోమం, రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణం, శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కల్యాణం, స్వామివార్ల ఏకాంతసేవలను, వేదాశీర్వచనాన్ని (మొత్తం 10 సేవలు) వారి గోత్రనామాలతో చేయించుకోవచ్చు.
క్యూ.ఆర్. కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి.హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా కూడా సేవా రుసుమును చెల్లించవచ్చు.
ఈ పరోక్షసేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భక్తులు ఈ ప్రసారాలను యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
అయితే స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లేదు.
ఇతర వివరములకు దేవస్థానం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 83339 01351 / 52 | 53/ 54 / 55/ 56 లను సంప్రదించవచ్చును.