కరోనా ప్రభావం: శ్రీశైల దేవస్థానం లో మరో ఐదు రోజులపాటు స్వామిఅమ్మవార్ల దర్శనాలు నిలిపివేత

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల క్షేత్ర పరిధి ఇంకా  కంటైన్మెంట్ జోన్ గా కొనసాగుతున్న కారణంగా మరో ఐదు రోజులపాటు  ఈ నెల 14వ తేదీవరకు ఆలయంలో  దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు.ఈ విషయమై స్థానిక తహశీల్దార్,  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారితో సంప్రదించి, వారి సూచనల మేరకు ఐదు రోజులపాటు దర్శనాలు నిలిపివేశారు.

ప్రస్తుతం కరోనా నిర్ధారణ అయినవారితో పైమరీ,  సెకండరీ కాంటాక్ట్స్ గలవారిని గుర్తించి జిల్లా యంత్రాంగం వారు కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దీర్ఘకాలంగా రక్తపోటు, మధుమేహం, అస్తమాతో బాధపడుతున్నవారికి,  జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కలవారికి కూడా ఈ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి తెలియజేశారు.

ఈ కరోనా పరీక్షల రిపోర్టులను బట్టి,  అప్పటి పరిస్థితుల అనుగుణంగా ఐదురోజుల తరువాత తదుపరి చర్యలపై తగు నిర్ణయం తీసుకుంటారు.

 కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా గత నెల 15వ తేదీ నుంచే ఆలయాలలో దర్శనాలను నిలిపివేశారు. 

యథావిధిగా స్వామి అమ్మవార్ల కైంకర్యాలు:

ఈ నెల 14వ తేదీ వరకు భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ నిత్యం జరిగే శ్రీస్వామిఅమ్మవార్ల కైంకర్యాలన్నీ యథావిధిగా ఉంటాయి.

 లోకకల్యాణం కోసం జరిపే దేవస్థానం సేవలైన (సర్కారి సేవలైన) సహస్రదీపాలంకరణ సేవ, నంది సేవ, శ్రీస్వామిఅమ్మవార్ల ఊయలసేవ, పల్లకీసేవ, గ్రామదేవత అంకాళమ్మపూజ, త్రపాలకుడైన బయలువీరభద్రస్వామిపూజ, కుమారస్వామిపూజ, దత్తాత్రేయపూజ మొదలైనవన్నీ యథావిధిగా ఆయా రోజులలో నిర్వహిస్తారు.

పరిమిత సంఖ్యలో అర్చకస్వాములు, పరిచారకులు తగు ముందు జాగ్రత్తలతో నిత్యకైంకర్యాలను, సర్కారిసేవలను నిర్వహిస్తారు.

| పరోక్షసేవలు కొనసాగింపు |:

ఆలయములో దర్శనాలు నిలుపుదల చేసినప్పటికీ, భక్తుల సౌకర్యార్ధం పరోక్షసేవలను యథావిధిగా కొనసాగుతాయి.

భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుము రూ. 1,116/-లను వెబ్ సైట్ – www.srisailamonline.com ద్వారా చెల్లించి, వారి గోత్రనామాలతో పరోక్షసేవలను జరిపించుకోవచ్చు.

క్యూ.ఆర్. కోడ్ ను ఉపయోగించి గూగుల్ పే, ఫోన్ పే, బి.హెచ్.ఐ.ఎమ్, పే.టి.ఎమ్ ద్వారా కూడా సేవా రుసుమును చెల్లించవచ్చు.

స్వామివారి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, గణపతి హోమం, రుద్రహోమం, చండీహోమం, మృత్యుంజయ హోమం, సుబ్రహ్మణ్యేశ్వరకల్యాణం, శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివాళ్లకల్యాణం, స్వామివార్ల ఏకాంత సేవలను మరియు వేదాశీర్వచనాన్ని (మొత్తం 10 సేవలు) వారి గోత్రనామాలతో చేయించుకోవచ్చు.

కాగా ఈ పరోక్షసేవలను ప్రత్యక్ష ప్రసారం చేయడం కూడా జరుగుతోంది. భక్తులు ఈ ప్రసారాలను యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. –

 స్వామివారి రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చనలను ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం లేదు.  ఈ అభిషేక,కుంకుమార్చనల సేవాకర్తలకు వారిసేవ జరిగే  సాయంత్రం వేదాశీర్వచనాన్ని అందిస్తారు. ఈ ఆశీర్వచనం ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

ఇతర వివరములకు దేవస్థానం కాల్ సెంటర్ ఫోన్ నంబర్లు 83339 01351 / 52 /53/54 / 55/ 56 లను సంప్రదించవచ్చును.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.