* నిరసనగా జూన్ 13న జర్నలిస్టుల ఉపవాస దీక్ష: టీయూడబ్ల్యూజే నిర్ణయం *
*ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందించాలని కె.శ్రీనివాస్ రెడ్డి, కె.విరాహత్ అలీ డిమాండ్ *
—————————–
కరోనా కాటుకు గురవుతున్న జర్నలిస్టులను ఆదుకోవడంలో ప్రభుత్వం నేర పూరిత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని ఇందుకు నిరసనగా జూన్ 13న రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఒక రోజు జర్నలిస్టుల ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్
జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) వెల్లడించింది . బుధవారం బషీర్ బాగ్ లోని దేశోద్ధారక భవన్ లో జరిగిన యూనియన్ ముఖ్య బాధ్యుల సమావేశంలో రాష్ట్రంలో జర్నలిస్టుల స్థితిగ తుల పై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐజేయూ అధ్యక్షులు
కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ కరోనా ప్రమాదం అంచున కొట్టుమిట్టాడుతున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం అపహాస్యం చేయడం సరైనది కాదన్నారు. గాంధీ ఆస్పత్రి నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే కరోనా కాటుకు యువ పాత్రికేయుడు మనోజ్ బలైపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం విచార కరమన్నారు. ఆయన కుటుంబాన్ని ఆదుకొనే విషయంలో కూడా ముందుకు రాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శమన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20 మంది పాత్రికేయులు కరోనా కాటుకు గురై చికిత్సా పరంగా పలు ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని టీయూడబ్ల్యూజే ఆందోళనకు పూనుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు. కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు మనోజ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా కరోనా కాటుకు గురైన మీడియా సిబ్బందికి చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని కేటాయించాలన్నారు. అత్యవసర సేవల విభాగం కింద పనిచేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రూ. 50లక్షల ఆరోగ్య బీమాను జర్నలిస్టులకు కూడా వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరారు. కరోనా వ్యాధికి గురైన మీడియా సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహకారాన్ని అందించాలని వారు సూచించారు. పై డిమాండ్లపై ప్రభుత్వం స్పందించని పక్షంలో జర్నలిస్టులను ఆదుకోవడానికి తాము భిక్షాటనకు సిధ్ధం కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. కరోనాపై ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను పాటిస్తూనే జూన్ 13న ఉపవాస దీక్ష చేస్తున్నామని, జర్నలిస్టుల
సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉన్న జర్నలిస్టుల సంఘాలు ఈ దీక్షకు కలిసి రావాలని శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీలు కోరారు. జర్నలిస్టుల కష్టాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిని, రాష్ట్ర గవర్నర్ ను ప్రతినిధి బృందం కలువతల పెట్టిందన్నారు. ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు అజిత, రాములు, హబీబ్ జిలానీ, స్వామి, హెచ్.యూ.జే అధ్యక్షులు రియాజ్ అహ్మద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కె.శ్రీకాంత్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యం.వెంకట్ రెడ్డి, జి.బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.