విజయవాడ: కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తుందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడం, రైతాంగాన్ని, పంటలను కాపాడుకోవడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం.. త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిందని, సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి.. వారి అనుమతితో నిర్ణయాలు తీసుకుంటామన్నారు. రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ టీమ్ సమావేశం అనంతరం కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
‘రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల రాకపోకలు, బయట ఎక్కువ తిరగకుండా చర్యలు తీసుకోవాలని గమనించాం. వీటిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చర్చించాం. రైతుబజార్లు, పెద్ద పెద్ద మార్కెట్‌లలో జనసాంద్రత పెరుగుతోంది. వాటిని రెగ్యులేట్ చేయాలని ఉన్నతాధికారులకు బాధ్యత అప్పగించాం.
చాలా మంది నిరుపేదలు, నిరాశ్రయులు, ఇతర రాష్ట్రాల వాసులకు భోజన వసతి కూడా లేదు. వారికి భోజన వసతి, ఆశ్రయం కల్పించాలని నిర్ణయించాం.
ఆక్వారంగం చాలా ఇబ్బందుల్లో ఉంది. ప్రస్తుతం అన్ని చెరువుల్లోంచి చేపల ఉత్పత్తి బయటకు వచ్చే పరిస్థితి. ఆక్వారంగాన్ని, రైతులను కాపాడుకోవాలి. ఏ విధంగా ఆక్వారంగాన్ని కాపాడాలనే అంశంపై చర్చించాం. రైతులు చేపలు పట్టడం నుంచి ప్రాసెసింగ్ వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులు, కార్మికులు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సంబంధిత శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమావేశం ఏర్పాటు చేశారు.
హార్టికల్చర్‌కు సంబంధించి అరటి, మామిడి, మిర్చి పంట చేతికొస్తుంది. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని చర్చించాం. అదే విధంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి పంట కోతకు వచ్చింది. వ్యవసాయ పనులు ఆటంకం లేకుండా ముందుకెళ్లేందుకు చర్చించాం. రైతులు, రైతు కూలీలు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం’ అని మంత్రి కన్నబాబు వివరించారు.