Kidambi Sethu raman *
కొలువరో మీరెల్ల కైమోడ్పులర్పించి
వెలిసేనిదే కంచిలోన అత్తి వరదుడు
హోమ కుండాన యాగ ఫలమై బుట్టి
అమరులకెల్ల ఆరాధ్యదైవమై నిలిచి
తమకము దీర కొనేటిలో పడుకున్న
సామజగిరి మీది వాడీ అత్తి వరదుడు
శంకు చక్రములు ఇరు కరముల బట్టి
అంకెపు శ్రీ సతినురమున దాల్చి
అంకించు వారికి అతి సులభుడైయున్న
పంకజ పాదముల వాడీ అత్తివరదుడు
బంగారు చేలమును నయముగా గట్టి
సింగారముగా నలుబది ఏండ్లకు వచ్చి
చెంగట అహోబలాన ప్రహ్లాదవరదుడైయున్న
అంగడి దొరతనముల వాడీ అత్తి వరదుడు