ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో పచ్చదనం పెంపు తక్షణం పూర్తి చేయాలి

ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పచ్చదనం పెంపు తక్షణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం హెచ్.ఎం.డి.ఎ అర్బన్ ఫారెస్ట్ అధికారులను ఆదేశించింది.
             ముఖ్యమంత్రి ఓఎస్డీ ( హరితహారం) ప్రియాంక వర్గీస్  హెచ్.ఎం.డి.ఎ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓఆర్ఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినందున మొత్తం 158 కిలో మీటర్ల పొడుగునా పచ్చదనంతో ప్రయాణీకులకు అహ్లాదంగా, కళ్లకు ఇంపుగా ఉండేలా చూడాలని కోరారు. మొక్కలు సరిగా లేని చోట, తక్కువ ఎత్తులో ఉండి, ఎదుగుదల లేని చోట్ల తక్షణం ఎత్తైన మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కల పెంపకం, పర్యవేక్షణ కాంట్రాక్టర్లకు వదిలివేయకుండా అధికారుల నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. ఓ ఆర్ ఆర్ చుట్టూ మొక్కలు నాటడం ఈ యేడాదితో పూర్తి కావాలని, వచ్చే యేడు నుంచి కేవలం నిర్వహణ బాధ్యత మాత్రమే ఉండేలా చూడాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు మణిహారంగా మారిందని, దేశ, విదేశీ ప్రయాణీకులకు తోడు, హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించేవారి నుంచి ప్రశంసలు వచ్చేలా పచ్చదనం తీర్చిదిద్దాలని ప్రియాంక వర్గీస్ కోరారు. మొత్తం ఓ ఆర్ ఆర్ కు తోడు సర్వీస్ రోడ్డు, మీడియన్లు, ఇంటర్ జంక్షన్లు అన్నీ చోట్లూ పచ్చదనం కనిపించాలన్నారు. రానున్న హరితహారం సీజన్ లో టోల్ గేట్ల అవుట్ పాయింట్ దగ్గర మొక్కల కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజల కోరిన మొక్కలు ఇచ్చే ఏర్పాటు చేయాలని, కొన్ని చోట్ల శాశ్వత ప్రాతిపదికన ఈ మొక్కల కౌంటర్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని సూచించారు. ఔటర్ చుట్టూ హరితహారం సైన్ బోర్డులతో పాటు, ప్రయాణీకులకు పచ్చదనం, పర్యావరణంపై అవగాహన కల్పించేలా బోర్డులు తగిన విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ఔటర్ నుంచి కిందకు, పైకి వెళ్లే జంక్షన్ ల వద్ద పచ్చదనం తీర్చిదిద్ది, స్థానికతను జోడించి ఆయా జంక్షన్ లకు పర్యావరణ హితంగా నందనవనం, మైత్రివనం లాంటి పేర్లు పెట్టే ప్రతిపాదనను పరిశీలించాలని తెలిపారు. ఔటర్ చుట్టూ అనేక కంపెనీలు, సంస్థలు ఉన్నాయని వాటితో చర్చించి సామాజిక బాధ్యత లో భాగంగా కొంత భాగం దత్తత తీసుకొనేలా ప్రోత్సాహించాలని తెలిపారు.
సమావేశంలో hmda అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ శ్రీనివాస్ తో పాటు  orr పచ్చదనం, నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించే అధికారులు పాల్గొన్నారు.
print

Post Comment

You May Have Missed