*హైదరాబాద్ ఃతెలంగాణ సర్కార్ మానవీయ కోణంలో వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నదని, అందువల్లే అన్ని సదుపాయాలతో పాటు ఐపీ, ఓపీ పెరిగి *నేనొస్త బిడ్డో సర్కార్ దవాఖానాకు* అని ప్రజలు అనే పరిస్థితి వచ్చిందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక చర్యల కారణంగా గుణాత్మక మార్పు వచ్చిందన్నారు. మరోవైపు అన్ని జిల్లా దవాఖానాల్లోనూ స్పెషాలిటీ వైద్యాన్ని విస్తరిస్తున్నామని, త్వరలోనే ఇంటింటికీ కంటి వైద్యం, రాష్ట్ర ప్రజలకు వైద్య పరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని చెప్పారు. సీఎం కెసిఆర్ దిశానిర్దేశం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. ఈ ఇద్దరు మంత్రులు హైదరాబాద్ లోని నారాయణగూడ లో గల ఐపీఎం ఆవరణలో జ్యోతిని వెలిగించి *తెలంగాణ డియాగ్నోస్టిక్స్* ని ప్రారంభించారు.
అనంతరం *మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ,* ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనే పరిస్థితి ఉండేది. అప్పటవి పరిస్థితులకు అద్దం పడుతూ అప్పట కవులు ఆ విధంగా పాటలు రాశారు. ప్రజలూ ఆదరించారు. కానీ నేటి పరిస్థితులు వేరు, తెలంగాణ ఆవిర్భావం తర్వాత వైద్యం రంగం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. ప్రభుత్వ విప్లవాత్మక చర్యలు, వైద్య రంగంలో గుణాత్మక మార్పులు తెచ్చాయన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి కృషి ఫలితంగా సత్ఫలితాలు వచ్చాయన్నారు. అందుకే సర్కార్ దవాఖానాల మీద ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. 20 ఐసియూలు, 40 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ కిట్ లాంటి హిట్ పథకాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. హైదరాబాద్ లో 17 బస్తి దవాఖాన లు ప్రారంభించామన్నారు. త్వరలోనే ఈ సంఖ్యను 45కి పెంచుతామని, నగరంలో మొత్తం 1000 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని కెటిఆర్ చెప్పారు. అలాగే ప్రస్తుత డయాగ్నోస్టిక్ సేవలను బస్తీ దవాఖానాలకు కూడా అన్వయించాలని కెటిఆర్ మంత్రి లక్ష్మారెడ్డికి సూచించారు.
సామాన్యులకు, పేదలకు రోగ నిర్ధారణ పరీక్షలు భారం కాకుండా వైద్య పరీక్షలు ఉచితంగా ప్రభుత్వమే అందించే చర్యలు అద్భుతమైన ఆలోచన అన్నారు. హైదరాబాద్‌లోని ఐపిఎంలోని డయాగ్నోస్టిక్స్ కేంద్రంగా 8 ఏరియా హాస్పిటల్స్ నుంచేగా 120 సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సేకరించిన రక్త నమూనాల పరీక్షలు ఇక్కడ జరుగుతుండటం గొప్ప విషయమన్నారు. ఒక గంటలో 20 నుంచి వెయ్యి వరకు పరీక్షల రిపోర్టులు తేగలిగే స్థాయి అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న టాటా ట్రస్ట్‌ని మంత్రి అభినందించారు.
గత ప్రభుత్వాలు ఏనాడూ ఇలా ఆలోచించలేదన్నారు. కేవలం ఇలాంటి వైద్యమే కాకుండా, ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తున్నదన్నారు. బతికి ఉండగా చేసే సేవలే గాక, మరణానంతరం కూడా పార్థివ వాహనాల ద్వారా సామాన్యుల పార్థీవ దేహాలను కూడా వారి ఇళ్ళకు చేరుస్తున్నదన్నారు.
వైద్యశాఖ ఇంత ప్రగతి సాధించినందుకు మంత్రి లక్ష్మారెడ్డిని, వైద్య ఆరోగ్య డాక్టర్లు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అలాగే వైద్యశాఖలో సిబ్బందిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
*మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ,* ప్రభుత్వ వైద్యశాలల మీద ప్రజలకు నమ్మకం పెంచుతున్నామని, పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు అందించడమే లక్ష్యంగా డయాగ్నోస్టిక్స్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు పరీక్ష కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. గతం లో ప్రభుత్వ దవాఖానా ల మీద ప్రజలకి నమ్మకం ఉండేది కాదు అప్పటి పరిస్థితుల్లో గణనీయమైన మార్పు తెచ్చామని చెప్పారు. జిల్లా దవాఖానాల్లో ఎక్కడికక్కడ అన్ని రకాల స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. తెలంగాణ డయాజ్ఞస్టిక్స్ అనేది గర్వించాల్సిన విషయం అన్నారు. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా మని వివరించారు.
బస్తి దవాఖానాల కు కూడా తెలంగాణ డియాగ్నోస్టిక్స్ సేవలను అందిస్తామని, బస్తీల్లో వుండే పేద ప్రజలకి బస్తి దవాఖానాలు ఉపయోగ పడుతున్నాయని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రం లో immunisation ని 90% కి పెంచామని తెలిపారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే అనేక రకాల వ్యాధులు రాకుండా చూసుకోవచ్చని, పెయిన్ కిల్లర్స్ ని ఇష్టం వచ్చినట్టు వాడటం వల్ల కిడ్నీలు దెబ్బ తింటున్నాయని మంత్రి తెలిపారు. మందుల వాడకం పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నామని, హెల్త్ ప్రొఫైల్ ని కూడా సిద్హం చేస్తున్నామని మంత్రి వివరించారు. సీఎం కెసిఆర్ సహకారం, దిశానిర్దేశం వల్లే ఇదంతా సాధ్యమవుతున్నదని మంత్రి లక్ష్మారెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
అంతుకుముందు మంత్రులిద్దరూ డయాగ్నోస్టిక్స్ సెంటర్‌ని పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్ ని తిలకించారు. కెటిఆర్ రక్త పరీక్ష చేయించుకున్నారు. అప్పటికప్పుడే వ్యాధి నిర్ధారణ పరీక్ష రిపోర్టులను కెటిఆర్‌కి ఇచ్చారు. అలాగే బ్రోచర్‌ని మంత్రులు ఆవిష్కరించారు. తెలంగాణ డయాగ్నోస్టిక్స్ యాప్‌ని ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో తమ రక్త నమూనాలను ఇచ్చిన పలువురు మహిళలకు వారి రిపోర్టులకు వారికి మంత్రులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ ఆయా మహిళలతో మాట్లాడుతూ, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ఎలా ఉందని? రిపోర్టులు ఎంత సమయంలో వచ్చాయని? ఉచితంగానే పరీక్షలు చేస్తున్నారా? లేదా? డయాగ్నోస్టిక్స్ సేవలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. సదరు మహిళలు బాగున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ ఏనాడూ ఇలాంటి సేవలు ఎరగమన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, సర్కార్ దవాఖానాలలో మంచి వైద్యం అందుతున్నదని, కెసిఆర్ కిట్ల పథకం అద్భుతంగా ఉందని కితాబిచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులతోపాటు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, డిహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు, టివివిపి కమిషనర్ డాక్టర్ శివప్రసాద్, ఐపిఎం డైరెక్టర్ డాక్టర్ శంకర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, ఎంఎన్‌జె డైరెక్టర్ డాక్టర్ జయలత, అరుణ్, గోపీకాంత్, టాటా ట్రస్ట్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.