ఐటి పరిశ్రమను  నగరంలో నలు దిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నం- ఐటి శాఖ మంత్రి కెటి రామారావు

నగరంలో ఐటి పరిశ్రమను నలు దిశాల విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఐటి శాఖ మంత్రి కెటి రామారావు తెలిపారు. ఈరోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలో నలు దిశాల ఐటి విస్తరణ, భవిష్యత్తు వ్యూహంపైన ఈ రోజు విస్తృత స్ధాయి సమీక్షా సమావేశాన్ని మంత్రి నిర్వహించారు.  ప్రస్తుతం ఉన్న ఐటి క్లస్టర్లకు తోడుగా ఉప్పల్, నాగోల్, సనత్ నగర్, మెడ్చేల్, కొంపల్లి వంటి కొత్త ప్రాంతాలకు ఐటి పరిశ్రమలను విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపైన ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. తెలంగాణ  రాష్ట్రం  ఏర్పడిన  తరువాత నగరంలో ఐటి పరిశ్రమ జాతీయ సగటు కన్నా ఎక్కువగా వృద్దిని నమోదు చేసుకుంటున్నదని, త్వరలోనే నగరంలోని ఐటి  ఎగుమతుల విలువ లక్ష కోట్లకు చేరుకుంటుందన్నారు. ఈ మేరకు పెరుగుతున్న ఐటి పరిశ్రమకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ మేరకు ఈ రోజు జరిగిన సమీక్షా సమావేశంలో పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, అర్ అండ్ బి, జియచ్ యంసి, మెట్రో రైలు,  హెచ్ యండిఏ ల  తరఫున తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఐటి పరిశ్రమ ఉన్న గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ర్టిక్ వంటి ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పైన స్వల్పకాలిక లక్ష్యాలతో చేపట్టాల్సిన చర్యలపైన ప్రణాళికలు రూపొందిచాలని టియస్ ఐఐసి అధికారులను మంత్రి అదేశించారు. దీంతోపాటు నూతనంగా ఏర్పాటు కానున్న మరో ఐటి క్లస్టర్ రాజేంద్రనగర్, బుద్వేల్ లోనూ ఇప్పటి నుంచే అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. నూతనంగా ఏర్పాటు కాబోయే క్లస్టర్లతోపాటు, విస్తరించనున్న క్లస్టర్లలోనూ రోడ్ల విస్తరణ, మురికి కాల్వల నిర్మాణం, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా మొదలైన అంశాలపైన పూర్తి స్థాయి కార్యచరణ చేపట్టాలని సంబంధింత అధికారులకు అదేశాలు జారీ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ విధానాల ఫలితంగా అనేక ఐటి సంస్ధలు నగరంలో నూతనంగా కార్యకలాపాలు చేపట్టేందుకు,  ప్రస్తుతం ఉన్న వాటిని విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. రానున్న ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాలు ఐటి రంగంలో రానున్నాయని మంత్రి తెలిపారు. అయితే ఈ పెరుగుదల ఒకే వైపు కాకుండా నగరంలోని నలుమూలల వస్తై,  భవిష్యత్తులో  ట్రాఫిక్ సమస్యల వంటి ఇబ్బందులు తలెత్తవని, సమ్మిళిత అభివృద్ది దిశగా ఐటి పరిశ్రమను తీసుకెళ్తామన్నారు.   అవసరం అయిన పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు, ఫీజిబులీటీ ఉన్న చోట్ల మెట్రో, యంయంటియస్ స్టేషన్లు వంటి ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామన్నారు. రాజేంద్రనగర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భూసేకరణ వంటి విషయాల్లో రెవెన్యూ,  టియస్ ఐఐసి, రంగారెడ్డి జిల్లా యంత్రాగం వంటి  శాఖల తీసుకోవాల్సిన చర్యలపైన ఈ సమావేశంలో చర్చించారు.
ఈ సమీక్షా సమావేశంలో టియస్ ఐఐసి, యచ్ యండిఏ, జియచ్ యంసి, ముగ్గురు  పోలీసు కమీషనర్లు, రంగారెడ్డి, మేడ్చేల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, అర్ అండ్ బి, వాటర్ వర్క్స్, విద్యుత్ శాఖాధికారులు  పాల్గొన్నారు .
print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.