ఏ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారినైనా అక్కున చేర్చుకుని, ఆదరించే సంస్కృతి హైదరాబాద్ సొంతమని, ఆ సంప్రదాయం మరింత గొప్పగా కొనసాగితీరుతుందని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. దేశ నలుమూలల నుండి హైదరాబాద్ కు వచ్చి చాలా మంది స్థిరపడిపోయారని, వారందరి సహకారంతో హైదరాబాద్ దేశంలోనే గొప్ప నగరంగా వెలుగొందుతున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర పురోగతికి ఆయువుపట్టుగా ఉన్న హైదరాబాద్ నగర అభివృద్ధిలో క్షత్రియుల (రాజుల) పాత్ర ఉందని చెప్పారు. భవిష్యత్ లో ప్రభుత్వం క్షత్రియులకు పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ప్రకటించారు. కొంపెల్లిలో బుధవారం జరిగిన క్షత్రియుల అర్థశతాబ్ధ ప్రస్థాన సమ్మేళనానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వర రావు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
‘‘ఉద్యమం ప్రారంభించినప్పుడు జల దృశ్యంలోనే నా వైఖరి స్పష్టంగా చెప్పాను. పొట్టకూటి కోసం వచ్చే వారితో పేచీలేదు. పొట్టకొట్టే వారితోనే పంచాయితీ అని చెప్పాము. చాలా మంది తమ వైఖరి మార్చుకున్నారు కానీ, మేము మార్చుకోలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధిలో అందరి పాత్ర ఉంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకుని స్థిరపడ్డారు. దాదాపు 300 ఏండ్ల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారు. వారందరూ హైదరాబాద్ లో భాగమయ్యారు. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. పూలగుత్తిలో అన్ని రకాల పూలు ఒదిగినట్లే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్ కు వన్నె తెచ్చారు. రాజులు పౌరుషానికి ప్రతీక. అల్లూరి సీతారామరాజు వారసులు. అలాంటి క్షత్రియులు హైదరాబాద్ నగరానికి వన్నె తెచ్చారు. అర్థ శతాబ్దం నుంచి వచ్చిన క్షత్రియులు (రాజులు) కూడా అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నారు. కోళ్ల ఫారాలు, ద్రాక్ష తోటలను హైదరాబాద్ కు పరిచయం చేసింది వారే. సినిమా, ఐటి, నిర్మాణ రంగాల్లో రాణిస్తున్నారు. హైదరాబాద్ లో భాగమయ్యారు. క్షత్రియులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహిస్తాం’’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
క్షత్రియ ప్రముఖులు రుద్రం రాజు శ్రీహరి రాజు, పెన్మత్స సోమ రాజు, బైర్రాజు సత్యనారాయణ, బంగార్రాజు, అప్పల్రాజు, సీతారామరాజు పాల్గొన్నారు.