ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి -వైయ‌స్‌ జగన్‌ ఆదేశం

తాడేప‌ల్లి : ముంపు బాధితులను ఆదుకోవడంతో ఉదారంగా వ్యవహరించాలని, ఖర్చుకు వెనకాడవద్దని కలెక్టర్లను ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణా బృందాలను అవసరమైన చోట్ల పెట్టుకోవాలన్నారు. గోదావరి వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులను సీఎం వైయ‌స్ జగన్‌ అధికారులతో సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై వారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

63 స‌హాయ శిబిరాలు..

గోదావరి వరద, దీని వల్ల తలెత్తిన పరిస్థితులపై అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. దాదాపు 5 బ్రిడ్జిలు మునిగిపోయాయని, 13 మండలాల్లో వరద ప్రభావం ఉందని, 161 గ్రామాలలో ముంపు పరిస్థితి ఉందని  తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ వివరించారు.  దిగువన అమలాపురంలో మరో 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని చెప్పారు. 20 లక్షల క్యూసెక్కుల వరకూ వరద వస్తుందనే అంచనాతో అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటి వరకూ 63 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్‌ను కూడా దృషిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. సహాయ శిబిరాల్లో మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచుతున్నామని, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.

రెడీగా ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు..

అవసరమైన వారందరికీ కోవిడ్‌ టెస్టులు చేస్తున్నామని, మంచి ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థకు ఇబ్బందులు వస్తున్నందువల్ల వీలైనన్ని శాటిలైట్‌ ఫోన్లు అందుబాటులో ఉంచామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు ఇప్పటికే వచ్చాయని, అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. నిత్యావసర సరుకులు, వస్తువులు తరలించడానికి, ఇతరత్రా అవసరాల కోసం 14 లాంచీలు సిద్ధం చేశామని, మరో 86 బోట్లు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వరదల వల్ల ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. వరద తగ్గిన తర్వాత పంట నష్టంపై అంచనా వేస్తామన్నారు. సహాయ శిబిరాల్లో సౌకర్యాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. మంచి భోజనం అందించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సీఎం  వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు.

మందుల‌న్నీ అందుబాటులో..

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతానికి 7 మండలాల్లో 30 గ్రామాల పరిధిలో వరద ప్రభావం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు చెప్పారు. పాలు, తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మూడు చోట్ల సిద్ధం చేశామన్నారు. ముంపు గ్రామాల నుంచి వృద్ధులను, గర్భవతులను తరలించామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనరేటర్లు సిద్ధం చేశామని, పాముకాట్లు ఉంటాయి కాబట్టి.. కావాల్సిన మందులన్నీ అందుబాటులో ఉంచామన్నారు. వరద తగ్గిన తర్వాత పంట నష్టంపై అంచనా వేస్తామన్నారు.

గండ్లు ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు..

పోలవరం వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న నాలుగు చోట్ల ఇసుక బస్తాలతో పటిష్టం చేశామని, గట్టుకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. వరద ఉన్నంత కాలం నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నట్టుగా కలెక్టర్లు చెప్పారు.

print

Post Comment

You May Have Missed