తాడేపల్లి: ఎంఫాన్ తుపాను కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, ఏపీ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం వైయస్ జగన్ సూచించారు. విద్యుత్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను వల్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని, చేపల వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎంఫాస్ తుపాను విషయమై చర్చించారు. తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలును కూడా వేగవంతం చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌గా ఉండాలని, కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంతవరకూ కొనుగోలు చేయాలని, వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు.
ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్‌లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలని సీఎం వైయస్ జగన్ సూచించారు. వీటికి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటే ధరల్లో కూడా స్థిరీకరణ వస్తుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలని, వాటిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుని పంపాలన్నారు. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుందని సీఎం వైయస్ జగన్ తెలిపారు.