శ్రీశైల దేవస్థానం: ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వర్తించాలని శ్రీశైల దేవస్థానం ఈ ఓ సూచించారు. దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా సంబంధి అంశాలను ఈ రోజు కార్యనిర్వహణాధికారి సమీక్షించారు.కార్యాలయ భవనం లోని సమావేశమందిరములో జరిగిన ఈ సమీక్షలో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.ఈ సమీక్షలో ఇంజనీరింగ్ విభాగం, గోశాల, ఆగమపాఠశాల, రెవెన్యూ, ఆన్లైన్ దర్శనాలు, ఆడిట్, లీగల్, అకౌంట్స్, ప్రచురణలు తదితర వాటిపై సమీక్షించారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ప్రతి శాఖాధికారి , ప్రతి పర్యవేక్షకులు వారి వారి విభాగాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.నిరంతర పర్యవేక్షణ వల్ల ఎలాంటి లోపాలు జరిగే అవకాశం ఉండదన్నారు. దేవస్థానంలో ప్రతి చర్య కూడా పారదర్శకంగా ఉండాలన్నారు. ఉద్యోగులందరు ముఖ్యంగా జవాబుదారితనాన్ని కలిగి ఉండాలన్నారు.ఆగమ పాఠశాల నిర్వహణపట్ల సంబంధిత ప్రిన్సిపల్ అధ్యాపకులు ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఆగమవిద్యార్థులకు ఆగమవిద్యను బోధించడమే కాకుండా సనాతనధర్మం , సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగించాలన్నారు.గోసంరక్షణశాలలో ప్రతి గోవు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. పశుగ్రాసం, దాణా మొదలైనవాటిని ఎప్పటికప్పుడు ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. గోశాలలో చేయవలసిన ఇంజనీరింగ్ పనుల గురించి వివిధ ఆదేశాలను జారీ చేశారు . ఆన్లైన్ ద్వారా అందిస్తున్న దర్శనం ,ప్రసాదవిక్రయాల టోకన్ల జారీని సమీక్షించారు. వర్షకాలం ప్రారంభమైన కారణంగా అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. అవసరమైన ఔషధాలను వైద్యశాలలో అందుబాటులో ఉంచుకోవాలని వైద్యవిభాగాన్ని ఆదేశించారు.క్షేత్రంలో మరింత పవిత్ర వాతావరణాన్ని కల్పించేందుకు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. దేవతా వృక్షాలను పలుచోట్ల నాటాలని సూచించారు.ఆడిట్ విభాగాన్ని సమీక్షిస్తూ అన్నివిభాగాల వారు కూడా ఆడిట్ అభ్యంతరాలకు సమాధానాలను రూపొందించి అడిట్ అభ్యంతరాలను తొలగింపజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
*నక్షత్రవనంలో ఈ ఓ తదితరులు వివిధ రకాల మొక్కలు నాటారు.
- సహస్ర దీపార్చన సేవ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు.