నియంత్రణ రేఖ వెలుపల ఉగ్రవాదుల సన్నాహక శిబిరాలను నిర్మూలిచేందుకు శస్త్ర చికిత్సతో కూడిన దాడులు చేసిన భారత్ సైన్యాన్ని నేను అభినందిస్తున్నాను. నియంత్రణ రేఖను దాటి జమ్ము కాశ్మీర్లో చొరబడుతున్న ఉగ్రవాదులను నిలువరించేందుకు భారత సైన్యానికి లభించిన అనుమతిలో భాగంగా ఈ దాడులు జరిగాయి.
పాక్ తన భూభాగాన్ని మన దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరిపేందుకు అనుమతించకూడదని ఆ దేశాన్ని భారత్ ఎంతో కాలంగా అభ్యర్థిస్తూ వచ్చింది. కాని ఈ విషయంలో పాకిస్తాన్ విఫలమయిన వైనాన్ని మొత్తం ప్రపంచం చాలా ఏళ్లుగా గమనిస్తూ వస్తోంది. దీని ఫలితంగా మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి తీవ్ర విఘాతం కలిగింది.
పాకిస్తాన్ గడ్డపైనుంచి ప్రేరేపితమైన ఉగ్రవాదం భారత దేశానికే కాదు, మొత్తం ప్రాంతానికే కాక ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్తో చర్చల ద్వారా శాంతిని సాధించేందుకు భారత్ అర్థవంతమైన ప్రయత్నాలన్నీ చేసింది. కాని పాక్ మాత్రం ఉగ్రవాదులకు సహాయాన్ని అందించడం, ప్రేరేపించడం, ఆర్థిక వనరులను అందించడం కొనసాగిస్తూ వచ్చింది.
భారత్ సానుకూల ప్రయత్నాలు చేస్తున్న కొద్దీ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులు పెంచుకుంటూ పోయి భారత్ ప్రజలు, ప్రభుత్వ సహనాన్ని పరీక్షించింది. ఉరిలో ఉగ్రవాదుల దాడితో ఈ దేశ ప్రజల ఆగ్రహావేశాలు మిన్ను ముట్టాయి. అలాంటి గర్హనీయమైన దాడులను ఏ మాత్రం సహించబోమని, దేశ భద్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ దేశానికి హామీ ఇచ్చారు.
గత రాత్రి మన సైన్యం జరిపిన దాడులు ఉగ్రవాదుల చొరబాటును భగ్నం చేయడం ద్వారా దేశ భద్రతను కాపాడే బాధ్యతలో భాగంగా జరిగాయి. భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరించినందుకు, నియంత్రణ రేఖ వెలుపల జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకున్నందుకు భారత ప్రజలు సైన్యానికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
మనది శాంతిని ప్రేమించే దేశం. కాని రెండు చేతులు కలిస్తే కాని చప్పట్లు రావన్నట్లు ఇద్దరూ కలిస్తే కాని శాంతి సంభవం కాదు. ఉపఖండంలో శాంతిని కాపాడడంలో తన బాధ్యతను పాకిస్తాన్ ఇప్పటికైనా గ్రహించాలి.
– ఎం. వెంకయ్యనాయుడు
కేంద్ర పట్టణాభివృద్ది, సమాచార ప్రసార శాఖ మంత్రి