
తాడేపల్లి: ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పథకం ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. వైయస్ఆర్సీపీ ఎప్పుడూ బాధ్యతారహితమైన ఆరోపణలు చేయలేదన్నారు.చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చేశారని, బూట్లు వేసుకొని పూజలు చేశారని గుర్తు చేశారు. సదావర్తి భూములను తన అనుయాయులకు కట్టబెట్టారని పేర్కొన్నారు. దాడుల వెనుక ఉన్న నిందితులను పట్టుకుని తీరుతామని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్కాంగ్రెస్పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు అత్యంత ప్రమాదకరమైన రాజకీయాలకు ప్రతిపక్షాలు తెర లేపాయి. మతాలు, దేవుళ్లతో ఆడుకుంటున్నారు. ఒక్కటే సూటి ప్రశ్న సీఎం వైయస్ జగన్ అడిగారు. వరుసగా, ఒక పద్ధతి ప్రకారం ఎక్కడైతే భద్రత ఏర్పాట్లు సరిగ్గా ఉండవో? చిన్న చిన్న గుళ్లు ఉన్న వాటిని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. విగ్రహాలను విరుగగొట్టడం, వెంటనే ఒక ఉద్యమం చేపట్టడం కనిపిస్తోంది. మెడపై తల ఉన్న ఎవరైనా, ఒ కటో తరగతి చదువుతున్న పిల్లాడికి కూడా ఇది బాగా తెలుస్తుంది.
ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ఆ రోజు ఉద్యమాలు చేశాం. సున్నితమైన, మత పరమైన అంశాలు స్వామిజీలు, మత గురువులు, బిషప్లు, ముస్లిం మత పెద్దలు మాట్లాడుకోవాలే తప్ప..రాజకీయ పార్టీలకు ఏమాత్రం సంబంధం ఉండదు. మతం పూర్తిగా వ్యక్తిగతం. ఎవరి విశ్వాసాలను వారు గౌరవించాలి. ఆ విశ్వాసాలకు భంగం కలుగకుండా చూడాలి. వైయస్ జగన్ ప్రజా రంజక పాలన చేస్తుండటంతో టీడీపీకి ఉన్న ఏకైన అస్త్రం కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. ఇక బీజేపీ ముందు నుంచి మతం అన్నది వాళ్ల అజెండాలో ఉంది. చంద్రబాబు వైఖరి మాత్రం గతంలో ఇలా లేదు. ఇప్పుడు పూర్తిగా విప్పేసి..మతంపైనే రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ తనను కలుపుకుపోతారని భావించి చంద్రబాబు ఇలా చేస్తున్నారేమో? .వైయస్ఆర్సీపీ పదేళ్ల చరిత్రలో ఇంత బాధ్యతారహితంగా ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. ఉన్మాదులు మాత్రమే ఇలాంటి దురాఘాతాలు చేస్తారు.
గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు తన షూటింగ్ కోసం గేట్లు మూసివేస్తే..జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 29 మంది చనిపోయారు. విజయవాడ పరిసరాల్లో కృష్ణ పుష్కరాల పేరుతో గుళ్లు కూల్చేశారు. రామతీర్థం ఘటనను సీఐడీకి అప్పగించారు. దోషులు బయటకు వస్తారు. భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించదు. ఇలాంటి ఘటనలతో టీడీపీకే నష్టం కలుగుతుంది. ఆలయాల వద్దకు ఎవరైనా వెళ్లవచ్చు. ఉద్రేకాలు రెచ్చగొట్టడం సరికాదు. వెళ్లే ముందు మనం ఏం చేస్తున్నామన్నది రాజకీయ నేతలు ఆలోచన చేయాలి.. గ్రామ పెద్దలు, నాయకులు గ్రామాల్లో గస్తీలు నిర్వహించి, పోలీసులకు సహకరిస్తే త్వరగానే ఇలాంటివి కంట్రోల్ చేయవచ్చు. జనసంచారం లేని ప్రాంతాల్లో జరిగే వాటికి పోలీస్ యంత్రాంగమే మొత్తం చేయాలనడం సరికాదు. పౌరులు కూడా సహకరించాలి. ఎక్కడైనా ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులకు అప్పగిస్తే..మరొకరు చేయరు. విజ్ఞులైన ప్రజలంతా కూడా మతాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే వారి సమస్యలు తీర్చాలే తప్ప..ఆధ్యాత్మిక సమస్యలు తీర్చేందుకు మత గురువులు, బోధకులు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సహకరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.