శ్రీశైల దేవస్థానం: ఈ నెల 29వతేదీన సెలవుదినమైన ఆదివారం, 30వ తేదీన కార్తీక మూడవ సోమవారం రోజున భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని దర్శించే అవకాశం ఉంది.ఈ రెండు రోజులలో కూడా అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటారనే అంచనాతో రద్దీని దృష్టిలో ఉంచుకుని వివిధ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భంగా ఈ రోజు 26 న కార్యనిర్వహణాధికారి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమీక్షలో వివిధ విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, దేవస్థానం వైద్యశాల వైద్యులు, ఉభయదేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు పాల్గొన్నారు. ఈ సమావేశములో స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి. రమణ, సబ్ ఇన్ స్పెక్టర్ హరిప్రసాద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డా. సోమశేఖరయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.
సుదీర్ఘంగా దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కోవిడ్ నిబంధనల అమలు, భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, రక్షమబద్దీకరణ, క్యూలైన్ల నిర్వహణ, సౌకర్యవంతమైన దర్శనం, శ్రీస్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, జ్వాలాతోరణం, లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి, పాతాళగంగ వద్ద నదీహారతి నిర్వహణ, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లు మొదలైనవాటి గురించి చర్చించారు.
ఆదివారం 29వ తేదీ సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం, పాతాళగంగ వద్ద పుణ్యనదీహారతి, పుష్కరిణివద్ద లక్షదీపోత్సవం – పుష్కరిణిహారతి, ఆ మరుసటిరోజైన మూడవ సోమవారం సాయంకాలం పుష్కరిణివద్ద లక్షదీపోత్సవం – పుష్కరిణిహారతి కార్యక్రమాలు ఉంటాయి.
పౌర్ణమి ఘడియలు ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు మాత్రమే ఉండడంతో జ్వాలాతోరణం, పుణ్యనదీ కార్యక్రమాలు, పౌర్ణమి సంబంధి లక్షదీపోత్సవం – పుష్కరిణిహారతి కార్యక్రమాలు ఆదివారమే నిర్వహిస్తారు. లక్షదీపోత్సవం – పుష్కరిణిహారతి సోమవారం కూడా నిర్వహిస్తారు .
కోవిడ్ నిబంధనలు:
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. ముఖ్యంగా కరోనావ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.దర్శనానికి విచ్చేసే భక్తులందరు కూడా తప్పనిసరిగా మాస్కును ధరించే నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అదేవిధంగా భక్తులు క్యూలైన్లలోనూ, ఆర్జిత సేవలలోనూ విధిగా భౌతికదూరాన్ని పాటించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.క్యూలైన్ల ప్రవేశ మార్గం వద్ద, ఆలయము నుంచి వెలుపలికి వచ్చే మార్గాలలోనూ, కౌంటర్లు మొదలైనచోట్ల చేతులను శానిటైజింగ్ చేసుకునే వీలుగా మరిన్ని శానిటైజింగ్ స్టాండులను ఏర్పాటు చేయాలన్నారు. ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు క్యూలైన్లను శుభ్రం చేస్తుండాలని ఆలయ మరియు పారిశుద్ధ్యవిభాగాలను ఆదేశించారు. క్యూలైన్ల పైపులు, ఆలయ ప్రాంగణములోని కటంజానాలను, మెట్ల మార్గంలోని రైలింగులు మొదలైన వాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజింగ్ చేయాలన్నారు.కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యలు మొదలైనవాటి గురించి భక్తులలో అవగాహన కలిగించేందుకు దేవస్థానం ప్రసారవ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు చేయిస్తుండాలన్ని శ్రీశైలప్రభ సంపాదకుణ్ణి ఆదేశించారు.
ఆలయవేళలో మార్పులు : –
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఆది,సోమవారాలలో దర్శన వేళలు మార్పులు చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. ఈ రెండు రోజులలో వేకువజామున గం.3.00లకే ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, ప్రాత:కాలపూజలు జరుపుతారు. తరువాత వేకువజామునగం.4.30లకు ఉభయదేవాలయాలలో మహామంగళహారతులు నిర్వహిస్తారు.
మహామంగళహారతుల సమయం నుండే అనగా ఉదయం గం.4.30ల నుండే సర్వదర్శనం ప్రారంభిస్తారు. ఈ సర్వదర్శనం సాయంత్రం గం. 4.30ల వరకు కొనసాగిస్తారు.తిరిగి ఆలయశుద్ది, సుసాంధ్యం, సాయంకాలపూజల తరువాతగం.5.30లకు మహామంగళహారతులుఉంటాయి. సాయంత్రం గం. 5.30ల నుంచి రాత్రి గం. 10.00ల వరకు దర్శనం కొనసాగిస్తారు.
ఆలయ దర్శన వేళలు గురించి ఎప్పటికప్పుడు దేవస్థానం ప్రసారవ్యవస్థ ద్వారా భక్తులకు తెలుపుతారు
. ఆర్జిత అభిషేకాలు :
ఆది,సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు అయిదు విడతలుగా వుంటాయి.
భక్తులు ఆన్లైన్ ద్వారానూ, కరెంట్ బుకింగ్ ద్వారా కూడా ఈ ఆర్జిత అభిషేకటికెట్లు పొందవచ్చు.
విడతల వారిగా జరిగే ఆర్జిత అభిషేక నిర్వహణ గురించి దేవస్థాన ప్రసారవ్యవస్థ ద్వారా నిరంతరం తెలియజేస్తుండాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. అదేవిధంగా ఈ అభిషేక కాలపట్టికల
ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయవలసినదిగా కూడా కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
క్రమసంఖ్య , విడతలు, సమయం ,అభిషేక ప్రదేశము
మొదటి విడత ఉదయం గం. 6.30లకు అలంకారమండపము, కల్యాణమండపం
రెండవ విడత | ఉదయం గం.8.30లకు అలంకారమండపములో మాత్రమే
3 వ విడత :ఉదయం గం. 11.30లకు అలంకారమండపము, కల్యాణ మండపం
నాలుగవ విడత
| మధ్యాహ్నం గం. 1.30లకు అలంకారమండపము., కల్యాణమండపం అలంకారమండపములో మాత్రమే
అయిదవ విడత సాయంత్రం
ఆర్జిత హోమాల నిర్వహణ :
ఆది,సోమవారాలలో ఆర్జిత హోమాలు కూడా రెండు విడతలుగా వుంటాయి.
క్రమసంఖ్య | హోమాలు ,సమయము,హోమ ప్రదేశము
రుద్రహోమం ఉదయం గం. 8.00లకు స్వామివారి యాగశాల
మృత్యుంజయ హోమాల ఉదయం గం. 10.00లకు
2 చండీహోమం ఉదయం గం. 8.00లకు, మరియు ఉదయం గం. 11.00లకు,అమ్మవారి యాగశాల
క్యూలైన్లలో ఏర్పాట్లు :
క్యూలైన్లలో భక్తులకు నిరంతరం మంచినీటిని, బిస్కెట్లు అందిస్తారు. ఉదయం వేళలో భక్తులకు విధిగా వేడిపాలను అందజేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
దర్శనం ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేంతవరకు కూడా నిరంతరం భక్తులకు ప్రసాదవితరణ చేస్తారు.
అన్నప్రసాదాల వితరణ :
ప్రస్తుతం అన్నదానంలో పంక్తి భోజనాలకు అవకాశంలేనికారణంగా ఉదయం గం. 10.00ల నుంచి మధ్యాహ్నం గం. 3.30ల వరకు కూడా అన్నప్రసాదాలు పొట్లాల రూపంలో అందిస్తారు.
లడ్డు ప్రసాదాలు :
ఆది,సోమవారాలలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన మేరకు లడ్డుప్రసాదాలను సిద్ధంగా ఉంచాలని ప్రసాదాల తయారీ విభాగాన్ని ఆదేశించారు.
మొత్తం 9 కౌంటర్ల ద్వారా ఈ లడ్డూ ప్రసాదాలు విక్రయిస్తారు.
విక్రయకేంద్రాల వద్ద కోవిడ్ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు .
కార్తీకదీపారాధన ఏర్పాట్లు :
భక్తులు కార్తీకదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. భక్తులు భౌతికదూరాన్ని పాటిస్తూ ఈ దీపాలను వెలిగించుకోవలసి ఉంటుంది. దీపారాధన నిర్వహణకుగాను ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని కార్యనిర్వహణాధికారి పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు.
ఆదివారం రోజున 29 సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉండడంతోఆలయం ముందుగల గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణోత్సవంవుంటుంది. జ్వాలాతోరణం వద్ద తొక్కిసలాట లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు.
పుణ్యనదీ హారతి:
ఆదివారం రోజున సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉండడంతో సాయంకాలం పాతాళగంగ వద్ద కృష్ణవేణినదీమతల్లికి పుణ్యనదీహారతి కార్యక్రమం వుంటుంది .
ఈ నదీహారతిలో నదీమాతకు నవహారతులు ఇస్తారు . పాతాళగంగ వద్ద ఉన్న కృష్ణవేణీ విగ్రహానికి పూజాదికాలు చేస్తారు.
కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని పరిమిత సంఖ్యలో అర్చకులు, వేదపండితులు నిర్వహిస్తారు.
కాగా కరోనావ్యాప్తని అరికట్టడంలో భాగంగా ఈ నదీహారతికి భక్తులను అనుమతించే అవకాశం లేదు.
పుష్కరిణి వద్ద లక్షదీ పార్చన, పుష్కరిణి హారతి
ఆదివారం రోజున సాయంకాలం పౌర్ణమి ఘడియలు ఉండడంతో సాయంకాలం ఆలయ “పుష్కరిణి ” వద్ద లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి వుంటాయి.
సోమవారం సాయంత్రం కూడా యధావిధిగా ఈ కార్యక్రమాలను వుంటాయి.
ఈ హారతిలో దశవిధ హారతులను ఇస్తారు . ఈ హారతులలో ఓంకారహారతి, నాగహారతి, త్రిశూలహారతి, నందిహారతి, సింహ హారతి, సూర్యహారతి, చంద్రహారతి, కుంభహారతి, నక్షత్ర హారతి, కర్పూరహారతులు ఇస్తారు.
వైద్యసేవలు:
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైద్యశాల సిబ్బంది అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. అవసరమైన అన్ని ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ముఖ్యంగా అత్యవసర ఔషధాలను కూడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.