ఇది కోవిడ్ సంక్షోభ సమయం- ప్రైవేట్ ఆస్పత్రులు ప్రత్యేక బాధ్యతతో, మానవతా దృక్పథంతో పనిచేయాలి : గవర్నర్ 

  • ప్రైవేట్ లో అందుబాటు ధరల్లో వైద్యం అందాలి
  • ఆస్పత్రుల్లో పడకల లభ్యత కోసం పూల్ ఉండాలి
  • ప్రజలకు ఆస్పత్రుల్లో పడకల లభ్యత ముందే తెలియాలి
  • ట్రీట్ మెంట్ బిల్లులో పారదర్శకత ఉండాలి
  • ప్రజల నమ్మకాన్ని గెలవండి
  • ప్రైవేట్ ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో గవర్నర్

తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించకూడదని, వైద్య ఖర్చులు అందరికీ అందుబాటులోకి రావాలని రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా చెబుతున్నానని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్యం అందలేదన్న దైన్యం మన రాష్ట్రంలో అసలే రాకూడదని, మధ్యతరగతి వారికైనా కనీసం కార్పోరేట్ వైద్యం అందుబాటులో ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలన్నదే తన తపన అన్నారు. ఈరోజు రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్య చికిత్స బిల్లుల్లో పూర్తి పారదర్శకత ఉండాలన్నారు. పేషంట్ ను అడ్మిట్ చేసేటప్పడే పూర్తి పారదర్శకతతో చికిత్స వివరాలు, ఖర్చులు వివరించాలని, వారి నమ్మకాన్ని చూరగొనాలని ఆమె అన్నారు. ఆస్పత్రుల్లో పడకల అందుబాటు కోసం ‘బెడ్స్ పూల్’ విధానం ద్వారా పేషంట్లకు పడకన అందుబాటు వివరాలు ముందే తెలిసేలా ఏర్పాట్లు ఉండాలి. పేషంట్లను ఆస్పత్రుల్లో పడకల కోసం అన్ని చోట్లా తిరిగే శ్రమ నుండి కాపాడాలని గవర్నర్ ఆదేశించారు. ఇది కోవిడ్ సంక్షోభ సమయమని, ప్రైవేట్ ఆస్పత్రులు ప్రత్యేక బాధ్యతతో, మానవతా దృక్పథంతో పనిచేయాలని డా. తమిళిసై అన్నారు.

కోవిడ్ టెస్ట్ ఫలితాలు ఆలస్యం కావడం వల్ల పేషంట్లలో మానసిక ఆందోళన కలుగుతున్నది. అవసరమైన వారికి వైద్యం అందించడంలో ఆలస్యమౌతున్నది. లాబోరేటరీలు ఫలితాలు తొందరగా అందించే విధంగా పనిచేయాలని  గవర్నర్ పేర్కొన్నారు. హెల్త్ కార్డులు, వైద్య భీమా కార్డుల వారికి వైద్యం అందించడానికి భీమా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు చేసి ప్లాస్మా థెరఫిని అందించాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు మరిన్ని సమకూర్చుకుని, ఎకానమి ప్యాకేజీలో కోవిడ్ చికిత్సను అందుబాటులోకి తేవాలని, మరిన్ని పడకలను, సిబ్బందిని సమకూర్చుకోవడానికి కృషి చేయాలన్నారు. కేసులు మరిన్ని పెరిగినా ప్రభుత్వ – ప్రైవేట్ సమన్వయంతో అందరికీ వైద్యం అందించే విధంగా సిద్ధంగా ఉండాలని గవర్నర్ సూచించారు. దాదాపు 80 శాతం బాధితులకు చాలా తక్కువ స్థాయిలో లక్షణాలు ఉంటాయని, వారికి హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స అందించే క్రమంలో వీడియో కన్సల్టేషన్, కౌన్సెలింగ్, టెలీ మెడిసిన్ పద్ధతుల్లో నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు.

హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా సరైన సరైన చికిత్స అందుతుందన్న నమ్మకం కలిగిస్తే ఎక్కువ మంది పేషంట్లు ఆస్పత్రుల్లో బెడ్స్ కోసం రారని, డా. తమిళిసై వివరించారు. హైదరాబాద్ ఫార్మా, మెడికల్, ఐటి హబ్ గా గుర్తింపు ఉన్న దృష్ట్యా వీరంతా కలిసి టెక్నాలజి ద్వారా సమన్వయంతో రోగులకు సేవలు, వైద్యం అందించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యులు గవర్నర్ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. అందులో ముఖ్యమైనవి పేషెంట్లు రెమిడెసివిర్, ఫారావిర్ లాంటి ఖరీదైన మందులు అడుగుతున్నారు, ఎక్కువ మంది కో-మార్చిడ్ స్థితి అంటే ఇతర వ్యాధులతో వస్తున్నారు అందుకే వైద్యం ఖర్చు పెరుగుతున్నదని వివరించారు. రెమిడెసివిర్ లాంటి మందుల కొరత ఉన్నది, తయారీ పెంచాలి, వాటిపై ప్రభుత్వ సబ్సిడీ కావాలి, వెంటిలేటర్ల తయారీ పెంచాలి, వైద్య సిబ్బందికి ఇన్సూరెన్స్ కల్పించాలన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని, ఏది ఏమైనా వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని, ఏ ఒక్కరికీ వైద్యం నిరాకరించకూడదని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజలు కూడా మరింత జాగరూకతతో వ్యవహరించి, భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, గుమికూడటం తగ్గించడం లాంటివి చేసి కరోనా ప్రబలకుండా చూడాలన్నారు.

ఈ సమీక్షలో కేర్, కిమ్స్, సన్ షైన్, కాంటినెంటల్, మల్లారెడ్డి, అపోలో, యశోధ, గ్లోబల్ తదితర హాస్పిటల్స్ వైద్యులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.