*ప్రజా కవి, రచయిత, పాత్రికేయులు, ఆత్మీయులు దేవిప్రియ ఇవ్వాళ తెల్లవారు ఝామున నిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసాయి. జోహార్…జోహార్
*కవి,జర్నలిస్ట్ దేవిప్రియ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
కవి,అమ్మచెట్టు,గాలిరంగు లాంటి అత్యుత్తమ సంకలనాలతో కేంద్ర సాహిత్య అవార్డు పొందిన దేవిప్రియ మరణం తెలుగు కవిత్వానికి తీరని లోటని ఆయన అన్నారు.అచ్చ తెలుగు కవిత్వం దేవిప్రియదని… కనుమరుగు కావడం కవిత్వం కోల్పోయిన ఒక శకమని అన్నారు.ఆయన మృతికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
*ఆయన పిలుపులో అభిమానం మారలేదు-Amar Devulapalli*
పెద్దలు , పూజ్యులు లాంటి మాటలు ఆయనకు ఇష్టం ఉండదు, మిత్రుడు అనడానికి నాకంటే వయసులో , జ్ఞానంలో చాలా పెద్దవాడు.ఉదయం పత్రికలో జర్నలిస్ట్ లుగా కలిసి పని చేసింది ఏడాదిన్నరే కాబట్టి కొలీగ్స్ మి అని గొప్పగా చెప్పుకోలేను. అయినా i was his boy. Yey damar అని ప్రేమగా పిలిచే దేవీ ప్రియ ఇక లేరు అన్న మాట చాలా బాధ కలిగిస్తున్నది. ఎమర్జెన్సీ లో ప్రజాతంత్ర ఎడిట్ చేస్తున్న కాలంలో శ్రీశ్రీ చేత అనంతం రాయించడానికి అబిడ్స్ అన్నపూర్ణ హోటల్ కి నా వేలు పట్టుకుని తీసుకు పోయిన దగ్గరి నుండి , ఎమర్జెన్సీ ఎత్తెయ్యగానే నర్సింగ్ మాభూమి సినిమా తీస్తున్న రోజుల నుండి చిన్న పిల్లగాడిగా నేను దేవీప్రియకు పరిచయం అయ్యాను.అక్కడి నుండి ఈ 40 ఏళ్లకు పైగా ఎక్కడా ఆయన పిలుపులో అభిమానం మారలేదు. నెలకోసారయినా ఫోన్ చేసి yey damar ఎలా ఉన్నావు అని అడిగే నా శ్రేయోభిలాషి దేవీప్రియ కు నివాళి.
*కృష్ణకి అభిమానులు లేరనుట నేరమోయ్..
విడుదలయిన రోజు చూడు
క్యూలు మైలు దూరమోయ్.. ‘
అక్షరాల మాంత్రికులు, మా అందరి ( ‘ఉదయం’ ) ప్రేమికుడు..
మా సుసంపాదకులు, నాకిష్టులు, నన్నిష్టపడిన దేవీప్రియ గారికి కన్నీటితో..
– శ్రీధర్ అక్కినేని.
*1982,83 లలో దేవీప్రియ,శివా రెడ్డి,నందిని సిధా రెడ్డి గారలతో కోఠి లోని హోటల్ హరిద్వార్ లో మా బోటి కుర్రాళ్లం కూర్చొని టిఫిన్ లతో పాటు కవిత్వాన్ని సుష్టు ఆరగించే వాళ్ళం..బిల్లు తో సహా కవిత్వాన్ని శివా రెడ్డి గారు, దేవీప్రియ గారు ఇచ్చేసే వారు..అప్పటికి సిధా రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్ లో వుండే వారు..నేను(విద్యారణ్య కా మ్లేకర్), కె.శ్రీనివాస్(ఇప్పుడు ఆంధ్ర జ్యోతి ఎడిటర్),కందుకూరు శ్రీరాములు తదితరులమంతా ఆ కుర్రాళ్ళ జాబితా లో వుండేవాళ్ళం..కొన్నాళ్ళకుహరిద్వార్ తర్వాత ద్వారకా హోటల్ కు స్థలం మారింది..దేవీప్రియ గారి అమ్మ చెట్టు లోని వో కవిత ని పేరడీ చేశా..ఆయన ఎంజాయ్ చేశారు..నేను ఆంధ్రప్రభ చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో గా వుండే రోజుల్లో వో సారి మా ఆఫీస్ కు వచ్చారు..చాలా విషయాలు మాట్లాడారు ..అప్పుడు కూడా ఆ పేరడీ ని ప్రస్తావించారు…ఆ కబుర్లు
ఎప్పుడయినా రాస్తాను..
ప్రేమైక మూర్తి దేవీప్రియ గారు..
వారి స్మృతి కి నివాళి..Vidyaranya
*గొప్ప కవి, మంచి పాత్రికేయుడు, అంతకు మించిన మానవతావాది, సహృదయుడు దేవిప్రియ గారు. కవిత్వంలో అయినా, వ్యాస సాహిత్యంలో అయినా ఆయన సృజనాత్మకత శైలి అత్యంత విలక్షణం. ఉదయం ఆదివారం అనుబంధంలో ఆయన ముద్రలు ఎన్నో. ఇటువంటి వారు చాలా అరుదు. నాకు గురుతుల్యులైన వారిని ఎప్పటికీ మరిచిపోలేను.
– బాలశేఖర శర్మ దోర్బల
*జర్నలిస్టు దేవిప్రియ అనారోగ్యంతో మృతి చెందారు. హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహిత్య లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ చదివారు. దేవిప్రియ ‘ఉదయం’ సహా పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. కానీ ‘దేవిప్రియ’ కలంపేరుతో రచనలు చేసేవారు. తండ్రి షేక్ హుస్సేన్ సాహెబ్, తల్లి షేక్ ఇమామ్ బీ. జర్నలిస్టుగా ఆయన ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ తదితర పత్రికలతో రచనా అనుబంధం ఉండింది. ఉదయం, హైదరాబాద్ మిర్రర్ పత్రికల్లో పనిచేశారు ఆయన రన్నింగ్ కామెంటరీ కార్టూన్ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. దాసి, రంగులకల తదితర సినిమాలకు ఆయన పనిచేశారు. అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, సమాజాంద స్వామి వంటి పలు రచనలు చేశారు. గాలి రంగు రచనకు గాను ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. sgstvtelugu.com నివాళి
*SUNDARAYYA VIGNANA KENDRAM MANAGING COMMITTEE
ప్రసిద్ధకవి, సీనియర్ జర్నలిస్టు దేవిప్రియ మరణం పట్ల సుందరయ్య విజ్ఞాన కేంద్రం తీవ్ర సంతాపం ప్రకటిస్తోంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు మరణించినప్పుడు ‘సుందరయ్యా నీలాంటి నేతలు మాకెందరయ్యా’ అని ఉదయం పత్రికలోని తన కవితా కాలంలో నాలుగు పంక్తుల కవితను ప్రచురించారు. ఆ కవిత ఆరోజు విశేషంగా ప్రజలను ఆకట్టుకొంది. అభ్యుదయవాదిగా ఆయన తన రచనలతో తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యక్రమాలు పట్ల ఆసక్తి చూపేవారు. సుందరయ్య వర్ధంతి రోజున నిర్వహించే స్మారకోపన్యాస సభలకు హాజరయ్యేవారు. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటిస్తూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేస్తున్నాం.