ఆలయాలు యజ్ఞయాగాది హోమాలు నిర్వహించడంవల్ల అందరూ సుఖశాంతులతో ఉంటారని శ్రీశైలం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ పేర్కొన్నారు .అదేవిధంగా ప్రజలు కూడా పుణ్యక్షేత్రాలను సందర్శించడం , ధార్మిక కార్యక్రమాలు లాంటివి చేయడం మంచిదని చెప్పారు . ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మ వార్ల కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు వారు పంచాంగ శ్రవణం చేసారు . పంచాంగ శ్రవణం కన్నా ముందుగా వేదపండితులు , అర్చకస్వాములు లోకకల్యాణార్థం సంకల్పం చెప్పారు . లోక సంక్షేమం కోసం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణ మూర్తులకు విశేష పూజలు జరిపారు . తరువాత నూతన పంచాంగానికి పూజాదికాలు నిర్వహించారు . అనంతరం పండిత సత్కారంగా ఆస్థాన సిద్ధాంతి వారిని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సత్కరించారు . అనంతరం సిద్ధాంతి వారు శ్రీ విళంబి నామ సంవత్సర విశేషాలు వివరించారు . భారత దేశామంతట ఈసారి సగటు వర్షపాతం నమోదు అవుతుందన్నారు . ఈసారి ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయన్నారు . అంతరిక్ష పరిశోధనలు , ఖగోళశాస్త్ర పరిశోధనలు, ప్రయోగాలు విజయవంతమై మన దేశ ఖ్యాతి పెరుగుతుందన్నారు .
స్వామిఅమ్మవార్ల కృపాకటాక్షం ఉండాలి :
శ్రీశైల క్షేత్ర ఆదిదేవుల కృపాకటాక్షం భక్తులు అందరిపైన ఉండాలని దేవస్థానం ఈఓ భరత్ ఆకాంక్షించారు .లోకకల్యాణ పూజలను దేవస్థానం శ్రద్ధగా చేస్తున్నదని ఆయన చెప్పారు . శ్రీ స్వామి అమ్మవార్ల కృపతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు . ఇవి నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
ఘనంగా రథోత్సవం :
సాయంత్రం ఘనంగా రథోత్సవం జరిపారు . ముందుగా సంప్రదాయ పూజలు జరిగాయి . అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను రథంపైకి వేoచేపు చేయించి రథోత్సవం జరిపారు.రథానికి చక్కని పుష్పాలంకరణ చేసారు .
ప్రత్యేక అలంకరణ ;
ఈరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో భాగంగా శ్రీ అమ్మవారి ఉత్సవ మూర్తికి రామావాణీ సేవిత రాజరాజేశ్వరీ అలంకారం విశేషం .అలంకార మూర్తికి విశేష పూజలు జరిపారు . ఈ దేవి దర్శనంవల్ల సమస్యలకు పరిష్కారం ఉంటుందని నమ్మకం . రాత్రి కన్నడ సంగీత విభావరి వీనులవిందుగా జరిగింది .భక్తులు ఉత్సాహంగా గ్రామోత్సవంలో పాల్గొన్నారు.
Post Comment