సీనియర్ పాత్రికేయులు , 1969 తెలంగాణ ఉద్యమ ఆద్యుల్లో ఒకరు , ప్రముఖ రచయిత ఆదిరాజు వెంకటేశ్వర రావు కు పాత్రికేయులు , సన్నిహితులు ఘన నివాళి అర్పించారు . శనివారం హైదరాబాద్ లోని దేశోద్ధారక భవన్ లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఐజేయూ) ఆదిరాజు సంస్మరణ సభను ఏర్పాటు చేసింది . యూనియన్ ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ సభ ఉద్దేశం వివరించారు . ముందుగా ఆదిరాజు నిలువెత్తు ఫొటోకు వక్తలు , ఆదిరాజు కుటుంబ సభ్యులు పుష్పాంజలి సమర్పించారు . సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్ర మూర్తి మాట్లాడుతూ ఖమ్మం నుంచి హైదరాబాద్ దాకా ఆదిరాజు వారితో తమ సాన్నిహిత్యాన్ని వివరించారు . ఆత్మీయతకు ఆదిరాజు మరోపేరు అన్నారు . సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ రెడ్డి తమ ప్రసంగంలో ఆదిరాజుకు ఘన నివాళి అర్పించారు . ప్రతి అంశాన్ని సునిశిత పరిశీలన అనంతరమే ప్రచురణకు వెళ్ళేవారని పేర్కొన్నారు . తాను మొదటిసారిగా విమానం లో ప్రయాణించడానికి ఆదిరాజు చొరవనే కారణమని సీఎం కార్యాలయం సిపిఆర్ఓ వనం జ్వాలా నరసింహా రావు సగర్వంగా చెప్పారు . ఆదిరాజు వంటి పాత్రికేయుల సహవాసంతోనే తానూ జర్నలిస్ట్ అయ్యానని వివరించారు .దేశ రాజధానిలో ఆదిరాజు హవాను ప్రత్యక్షంగా చూసానన్నారు . ఆదిరాజు అంటే తూఫాన్ ఎక్ష్ప్రెస్స్ అన్నారు సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి . ఆదిరాజు ఒక సంచలన జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారని చెప్పారు . సీనియర్ పాత్రికేయులు టి.ఉడయవర్లు తమ ప్రసంగంలో ఆదిరాజు స్నేహ సంబంధాలను పేర్కొన్నారు . అనురాగం ఆత్మీయత తో తాము మంచి స్నేహ సంబంధం పెంచుకున్నామన్నారు . సలహాలు తీసుకోడానికి వెనుకాడేవారు కాదని అన్నారు . ఆదిరాజుకు ఇంగ్లీష్ , హిందీ, ఉర్దూ , తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్నందున ప్రముఖ పాత్రికేయుడి గా , రచయితగా పేరు పొందారని అన్నారు . ఆదిరాజు రచించిన పుష్తకాల కాపీలు బాగా మార్కెట్ కావాలని కోరుకున్నారు కాని వాటి ఆధారంగా నేరుగా డబ్బు ఆశించేవారు కాదని చెప్పారు . వార్త రాయాలంటే ఆధారం కోసం తెగ ప్రయత్నం చేసేవారని పేర్కొన్నారు . ప్రెస్ కౌన్సిల్ సభ్యులు దేవులపల్లి అమర్ తమ ప్రసంగంలో ఆదిరాజు ను డైనమిక్ జర్నలిస్ట్ గా కొనియాడారు . ఆదిరాజు వద్ద ఎంతో విషయ సేకరణ ఉండేదన్నారు . ప్రజలకు ఉపయోగపడే అంశాలనే ఆదిరాజు పాత్రికేయ వృత్తిలోను , పుస్తక రచనలో వస్తువు గా ఎన్నుకున్నారని అమర్ పేర్కొన్నారు . ఎవరికైనా సహాయం చేయాల్సివస్తే చాలా చొరవతో పని పూర్తి చేసేవారని చెప్పారు . ఆదిరాజు లో అద్భుత పరిశీలన గుణాలు ఉండేవని అదే ఆయన విజయ రహస్యమని చెప్పారు . జలగం వెంగళరావు , చెన్నారెడ్డి , అంజయ్య లాంటి ప్రముఖ నాయకులతో సాన్నిహిత్యం ఉన్నా పత్రికా రచనలో రాజీ పడే వారు కాదన్నారు . సమాచార భారతి సారథి గా పలువురిని జర్నలిజం లోకి తీసుకువచ్చారని అమర్ గుర్తు చేసారు . పాత్రికేయ వృత్తిలో అనేక అంశాలను తాము ఆదిరాజు వద్ద నేర్చుకున్నామని సీనియర్ జర్నలిస్ట్ కోవూరు హనుమంతరావు తెలిపారు . తాము సమాచార భారతి లో ఆదిరాజు వారివద్ద వృత్తి నైపుణ్య విషయాలు నేర్చుకున్నామన్నారు . ఆదిరాజు అంటే డైనమిక్ జర్నలిస్ట్ గా పేర్కొని నివాళి అర్పించారు . తాను ఆదిరాజు ను మరువలేనని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాస రావు చెప్పారు . ఆదిరాజు అంటే ఓ ప్రత్యేకం అన్నారు .
సభకు వచ్చిన ఆదిరాజు సన్నిహితులు సూర్యనారాయణ , డీవీఎస్ రామకృష్ణం రాజు , సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ పిళ్ళై తదితరులు ఆదిరాజు వారితో తమ అనుబంధాలను గుర్తుచేసుకున్నారు . సభకు వచ్చిన ఆదిరాజు కుటుంబ సభ్యులకు వక్తలు , సన్నిహితులు సానుభూతి ప్రకటించారు . విరాహత్ అలీ అందరికి సవినయంగా కృతజ్ఞతలు తెలిపారు .
ఆదిరాజు గారితో జ్ఞాపకాలకు అక్షర రూపం ఇవ్వండి :
ఆదిరాజు గారితో జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చి సీనియర్ జర్నలిస్ట్ అజయ్ కి ఇవ్వగలరని దేవులపల్లి అమర్ కోరారు . ప్రెస్ క్లబ్ ఉన్నతికి కారకుల్లో ఒకరైన ఆదిరాజు జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం తలపెట్టాలని అమర్ ప్రెస్ క్లబ్ నిర్వాహకులను కోరారు .