ఆంధ్రావని నుంచి అమెరికా వరకు అంకురించిన ప్రకృతి సేద్యం

23 నుంచి 27 వరకు ముఖ్యమంత్రి పర్యటన
అమరావతి, సెప్టెంబర్ 21 : ఆంధ్రావని పసిడి నేలపై అంకురించిన ‘ప్రకృతి సేద్యం’ అంతర్జాతీయ వేదికపై వేళ్లూనుకోనున్నది. ఈనెల 25వ తేదీ తెల్లవారుజాము 3 గంటలకు (భారత కాలమానం) న్యూయార్క్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సదస్సులో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సు’లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి బృందం ఈనెల 23 వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అమెరికాలో పర్యటించనుంది.
 తన విదేశీ పర్యటనల్ని రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు సమర్ధంగా వినియోగించుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యాయం కూడా పారిశ్రామిక, వాణిజ్య సమూహాలతో విస్తృత సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అనేక ద్వైపాక్షిక, బృంద సమావేశాల్లో పాల్గొంటారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి అమెరికన్ సాంకేతిక, మేధో పరిజ్ఞానాన్ని జత చేసేందుకు పరస్పర సహాయ సహకారాలపై ప్రధానం చర్చిస్తారు. ఇప్పటికే ప్రకృతి సేద్యంలో ఏపీ దేశంలోనే అగ్రగామిగా ఎదిగి సాధిస్తున్న విజయాలను ముఖ్యమంత్రి అంతర్జాతీయ వేదికపై వివరిస్తారు.
2024 నాటికి 60 లక్షల రైతుల ద్వారా రెండు కోట్ల ఎకరాలకు విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. ప్రజల ఆహారపు అలవాట్లు మారిన నేపధ్యంలో పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర రైతాంగం చీడపీడలు లేని, భూసార, జల, వాయు కాలుష్య రహిత సేద్యాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే 2018 వ సంవత్సరాన్ని పైసా పెట్టుబడి లేని ప్రకృతి సేద్య సంవత్సరంగా ప్రకటించారు. శీతల గిడ్డండులలో నిల్వ చేసి పరిరక్షించడం మొదలు అంతర్జాతీయ స్థాయిలో విఫణి సదుపాయాలను కల్పించే వరకు రైతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ కృషిలో భాగస్వామ్యం తీసుకునేందుకు ముందుకువచ్చే సంస్థలతో ఒడంబడికలు కుదుర్చుకోవడానికి తన అమెరికా పర్యటనను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఏపీలో అంతకంతకూ విస్తారం అవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించాల్సిందిగా ఈ పర్యటనలో ఆ రంగానికి చెందిన నిపుణులను, వాణిజ్య సమూహాలను ముఖ్యమంత్రి ఆహ్వానిస్తారు. ప్రకృతి సేద్యపు నైపుణ్యాలను, మెరుగైన పద్ధతులను ఏపీకి పరిచయం చేయడానికి గల అవకాశాలను అన్వేషిస్తారు.
22వ తేదీ రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్ నుంచి బయల్దేరి అమెరికాకు వెళతారు. తొలిరోజు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్‌తో సమావేశమవుతారు. ఆ తరువాత ఇంటలిజెంట్ ఎడ్జ్, అరూబా నెట్‌వర్క్స్ (హెచ్‌పీఈ బిజినెస్ యూనిట్) వ్యవస్థాపకుడు కీర్తి మెల్కొటే, ఇమాజినేషన్స్ టెక్నాలజీస్ సంస్థ అధ్యక్షుడు కృష్ణ యార్లగడ్డతో సమావేశం అవుతారు. తరువాత న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌జేఐటీ) స్టూడెంట్ సెనేట్‌కు వెళతారు. అదేరోజు ప్రవాస భారతీయ పెట్టుబడిదారులతో విస్తృత సమావేశం వుంటుంది.
రెండోరోజు సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థ-‘మడోయర్ మెరైన్’ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ PHUMZILE MLAMBO-NGCUKAతో భేటీ అవుతారు. రిటైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బీఎన్‌పీ పరిబాస్’ ఛీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ జీన్ లారెంట్ బొన్నాఫే (JEAN-LAURENT BONNAFE)తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ (JIM YOUNG KIM)తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాను కలుస్తారు. ఆ తరువాత వరసగా ద్వైపాక్షిక సమావేశాలు వుంటాయి. యుఎన్ ఎన్విరాన్‌మెంట్ ఎరిక్ సోలీమ్ (ERIK SOLHEIM)తో సమావేశం తరువాత ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కీలక సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిదిమందిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరు.
print

Post Comment

You May Have Missed