అసాధారణ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రాధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం అన్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వీలైనంత సహాయం అందిచాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల వల్ల అపార నష్టం జరిగిందన్నారు. చెరువు కట్టలు తెగిపోవటం, బుంగాలు పడటం, రోడ్లు తెగిపోవటం, వంతెనలు కులిపోవటం లాంటి సంఘటనలు జరిగాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థిరాస్తులకు కూడా నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం నష్టంపై అంచనా వేయాలని ఆదేశించారు. చాలా చోట్ల పంట నష్టం కూడా జరిగిందని ఆ వివరాలు కూడా సేకరించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, ఇతర మౌళిక వసతులు, పంటనష్టంపై అంచనా వేసి నివేదిక తయారుచేయాలన్నారు. ఆ అంచనాలను బట్టి నివేదిక రూపొందించి కేంద్రానికి అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి తగిన సహాయం అందించాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశించారు.