తిరుపతి, 2021 మార్చి 20: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
అశ్వవాహనం :
ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. స్వామి అశ్వవాహనంపై తన కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ కలి దోషాలకు దూరంగా ఉండాలని నామ సంకీర్తనాదులను ఆశ్రయించి, తరించాలని ప్రబోధిస్తున్నాడు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
సర్వభూపాల వాహనంపై శ్రీరామచంద్రమూర్తి అభయం
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ఉదయం రథోత్సవం బదులు సర్వభూపాల వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు
సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.
వాహన సేవ అనంతరం ఉదయం 9 నుండి 10 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబరి నీళ్ళతో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాములవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు.
కాగా సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. రాత్రి 8.00 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ జరగనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామివారికి శేషవస్త్రం సమర్పించిన టిటిడి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని శ్రీ గురురాఘవేంద్ర స్వామివారి 426వ వర్ధంతి ఉత్సవం సందర్భంగా టిటిడి తరఫున అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి శనివారం ఉదయం శేషవస్త్రం సమర్పించారు.
హైందవ సనాతన ధర్మవ్యాప్తికి కృషి చేసిన సద్గురువుల భగవత్ భాగవత సేవల దృష్ట్యా 2006వ సంవత్సరం నుంచి శ్రీ రాఘవేంద్రస్వామివారికి శ్రీవారి శేషవస్త్రాన్ని టిటిడి సమర్పిస్తోంది. సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారి కృపతో 1595వ సంవత్సరంలో తమిళనాడులోని కావేరిపట్నంలో శ్రీ తిమ్మన్న భట్ట, శ్రీమతి గోపికాంబ దంపతులకు శ్రీ రాఘవేంద్రస్వామివారు జన్మించారు. శ్రీరాఘవేంద్రస్వామి పూర్వాశ్రమ నామధేయం కూడా వెంకన్న భట్ట, వెంకటాచార్యగా ప్రశస్తి.
ముందుగా మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారికి అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి శేషవస్త్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీ సుబుదేంద్రతీర్థ స్వామివారు అదనపు ఈవోను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఏఈఓ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.