అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్, రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.గురువారం సమాచార భవన్ లోని బోర్డురూమ్ లో రాష్ట్రస్థాయి అక్రెడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు విరాహత్ అలీ, బసవ పున్నయ్య, కట్టా కవిత, సౌమ్య, వి. సతీష్, కోటిరెడ్డి, ప్రకాశ్, గంగాధర్, కిరణ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య, మీడియా అకాడమీ కార్యదర్శి ఎస్. విజయ్ గోపాల్, జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, అసిస్టెంట్ డైరెక్టర్ హష్మి , సంపత్ తదితరులు పాల్గొన్నారు.అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన అక్రెడిటేషన్ కమిటీ సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. నూతన అక్రెడిటేషన్ కార్డులు ఈ అక్టోబర్ నెల నుండి 2021 సెప్టెంబర్ వరకు మనుగడలో ఉంటాయని అల్లం నారాయణ తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ జర్నలిస్టులకు అత్యధికంగా అక్రెడిటేషన్ల సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది అన్నారు. ఆన్ లైన్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోని అర్హత గల జర్నలిస్టులు వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని సూచించారు . రాష్ట్రంలోని చిట్టచివరి జర్నలిస్టు వరకు కార్డులు ఇస్తామని తెలిపారు. జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తామని తెలంగాణ జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.