అమరావతి అభివృద్దిలో నిర్మాణాలు చేపట్టేందుకు ముందుకువచ్చే డెవలపర్స్ కు అన్ని విధాల సహకరిస్తామని ఏపీసీఆర్ డీ ఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ హామీ ఇచ్చారు . వెలగపూడి సచివాలయంలో బుధవారం నిర్వహించిన అమరావతి డెవలపర్స్ కాన్క్లేవ్ కు వచ్చిన డెవలపర్స్ కు అమరావతి రాజధాని నిర్మాణ ప్రగతిని కమిషనర్ వివరించారు . అమరావతి రాజధాని నగరం చుట్టూ 5.8 మిలియన్ జనాభా తో కూడిన ఆర్ధిక వ్యవస్థ ఉందని , 12 కి.మీ. దూరంలో విజయవాడ, 20 కి మీ. దూరంలో గుంటూరు నగరాలకు మధ్య భాగంలో ఈ నగరం నిర్మాణమవుతోందని వివరించారు .
రాజధాని నిర్మాణంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని డాక్టర్ చెరుకూరి శ్రీధర్ చెప్పారు .58 వేల ఎకరాల భూమి ప్రస్తుతం నగర నిర్మాణానికి అందుబాటులో ఉందన్నారు .ఇందులో భూ సమీకరణ పథకంలో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని వివరించారు . ఎలాంటి సమస్యలు లేని భూమిని అభివృద్ధి పరచడంలో 27 వేల మంది రైతులను భాగస్వాములను చేశామన్నారు . రాజధాని ప్రయోజనాలను పొందడంలో వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు . ఈ భూములలోనే కేవలం ఏడు నెలల వ్యవధిలో ప్రభుత్వ భవన సముదాయాన్ని నిర్మించి సచివాలయం , శాసన సభ ఇక్కడినుంచే నిర్వహించుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు . ఈ 40 నెలల లో తొలి 15 నెలలలోనే భూ సమీకరణ , మాస్టర్ ప్లాన్ పూర్తి చేశామన్నారు . ప్రఖ్యాత సంస్థలు రెండు వేల మందికి విద్య అందిస్తున్నాయన్నారు .యెన్.ఐ.డి., ఎయిమ్స్ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని శ్రీధర్ చెప్పారు .మొత్తం 320 కి.మీ. రోడ్లకు గాను 284 కి.మీ. పొడవైన రోడ్లు అత్యంత వేగంగా నిర్మితమవుతున్నాయన్నారు .
అత్యున్నత ప్రమాణాలు కలిగిన పది స్కూళ్ళు, ఎనిమిది స్టార్ హోటళ్ళు, ఆసుపత్రుల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని కమిషనర్ తెలిపారు . జీ ప్లస్ 12 ఫ్లోర్లతో 61 టవర్లలో నాలుగు వేల ఫ్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులు , అధికారులు , శాసన సభ్యులకు నిర్మిస్తున్నామని తెలిపారు .డెవలపర్స్ కు ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు . 350 ఎకరాల నుంచి 1500 ఎకరాల దాకా విస్తీర్ణం కలిగిన ఏడు ద్వీపాలు కృష్ణా నదిలో అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్నాయని వివరించారు . అమరావతిలో సుమారు వంద ఎకరాల వరకు అభివృద్ధి పరిచేందుకు , ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు భూమిని కేటాయించవచ్చునని వివరించారు . నూతన సచివాలయం నిర్మాణం మాదిరిగా డెవలపర్స్ 40 అంతస్థుల మేర నిర్మాణం చేయడానికి వీలుందని అన్నారు . నిర్మాణాలకు వచ్చే డెవలపర్స్ కు అన్ని విధాల సహకరిస్తామని ఆయన చెప్పారు . డీ ఎల్ ఎఫ్, శోభా డెవలపర్స్, ప్రేస్టీజ్ ప్రాజెక్ట్స్ , మై హోమ్స్ , రహేజా, మహీంద్ర ,ఈవీపీ ,శాపూర్జీ , ఎల్ అండ్ టి , అపర్ణ , సాలపురి , జీవీకే, యెన్ ఎస్ ఎల్ , గార్డెన్ సిటి , సైబర్ సిటీ నిర్మాణ సంస్థల ప్రతినిధులకు అమరావతి విశేషాలను కమిషనర్ శ్రీధర్ వివరించారు . వారు ఆసక్తిగా విన్నారు .