అన్ని విధాలుగా తోడుగా ఉంటా -‌ జగన్‌

విశాఖపట్నం: గ్యాస్‌ లీకేజీ ఘటన దురదృష్టకరం. ఈ దుర్ఘటనలో అస్వస్థతకు గురై మృతిచెందిన కుటుంబాలకు, చికిత్స పొందుతున్న వారికి, గ్యాస్‌ ఎఫెక్టెడ్‌ ప్రాంతాల ప్రజలకు తోడుగా ఉంటానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనపై కమిటీని కూడా నియమించడం జరిగిందని, కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ. కోటి పరిహారం, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందిస్తామని, గ్యాస్‌ వల్ల ఎఫెక్ట్‌ అయిన ఐదు గ్రామాల ప్రజలు దాదాపు 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తామన్నారు. జరిగిన ఘటనపై కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్‌ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారికి, గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.
గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన గురించి జరిగిన సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. సీఎం ఏం మాట్లాడారంటే.. 

‘ఈ రోజు తెల్లవారు జామున గ్యాస్‌ లీకేజీ ఘటన జరగడం. స్టైరీన్‌ అనే హైడ్రో కార్బన్‌ ఈ ఫ్యాక్టరీకి రా మెటీరియల్‌గా ఉపయోగపడేది. ఈ మెటీరియల్‌ ఎక్కువ రోజులు స్టాక్‌ ఉండడం వల్ల పాలిమరైజేషన్‌ జరిగి దాని వల్ల గ్యాస్‌ తెల్లవారుజామున లీక్‌ కావడం.. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు గ్యాస్‌ లీకేజీతో ఎఫెక్టయ్యాయి. ఇది చాలా బాధాకరమైన అంశం. కానీ, ఎల్‌జీ లాంటి గుర్తింపు కంపెనీ.. మల్టీనేషనల్‌ కంపెనీలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇంకా బాధాకరం.

లోతుగా అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు
ఈ జరిగిన ప్రమాదానికి సంబంధించి లోతుగా అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని ఒక కమిటీని నియమిస్తున్నాం. పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఇండస్ట్రీ సెక్రటరీ, పీసీబీ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ను కమిటీలో సభ్యులుగా చేర్చుతున్నాం. లోతుగా అధ్యయనం చేసి ఏం జరిగింది.. మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలి అనే అంశంపై వీరు అధ్యయనం చేసి రిపోర్టు ఇస్తారు. ఆ రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటాం.

ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగినప్పుడు గ్యాస్‌ లీకైనప్పుడు అలారం ఎందుకు మోగలేదు. అలారం మోగకపోవడం కరెక్టు కాదు. లోతైన అధ్యయనం చేసిన తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాం.

అధికారుల పనితీరు అభినందనీయం
అధికారులను అభినందించాలి. తెల్లవారుజామున ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు అందుబాటులోకి రావడం. కలెక్టర్‌ 5:30 గంటలకు ప్రమాదస్థలికి చేరుకోవడం. పోలీసులు 4:40కే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని రకాలుగా అధికారులను అభినందించాలి. వెంటనే స్పందించారు. అంబులెన్స్‌లతో దాదాపు 348 మందిని అన్ని ఆస్పత్రులకు చేర్చారు. ప్రమాదం జరిగినప్పుడు అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయిన వారు కూడా ప్రస్తుతం కోలుకున్నారు. ఇందుకు వైద్యులు కృషి అభినందనీయం.

ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటాను..
జరిగిన దుర్ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ తొమ్మిది కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జరిగిన ఘటనలో చనిపోయిన వారిని నేను వెనక్కు తీసుకురాలేకపోయినా.. మంచి మనసున్న వ్యక్తిగా కచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా.. చనిపోయిన ప్రతి కుటుంబానికి కంపెనీ ఏ మేరకు ఇచ్చినా కూడా గవర్నమెంట్‌ అన్ని రకాలుగా ముందుంటి ఆదుకుంటుంది. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా రూ. కోటి పరిహారం డిక్లెర్డ్‌ చేస్తున్నా.

అంతేకాకుండా ఆస్పత్రుల్లో వైద్యం చేసుకుంటున్నారో.. ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ. 25 వేలు, రెండు మూడు రోజుల పాటు ఆస్పత్రుల్లో ఉండాల్సిన వారికి రూ. లక్ష పరిహారం, అంతేకాకుండా వెంటిలేటర్‌ సహాయంతో వైద్యం చేసుకుంటున్న వారికి రూ. 10 లక్షల పరిహారం ఇవ్వడం జరుగుతుంది.

వారికి కూడా సాయం అందిస్తాం..
ఏ ఒక్క రూపాయి ఎవరూ వైద్య ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఉచితంగా వైద్యం అందిస్తాం. డిశ్చార్జ్‌ అయ్యే సమయంలో ఈ పరిహారం అందించి ఇళ్లకు పంపిస్తాం. విష వాయువు వల్ల మనుషులకు డైరెక్ట్‌గా ఎఫెక్ట్‌ కాకపోయినప్పటికీ మానసికంగా ఒత్తిడి చూపిస్తుంది. అలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయో అని అడిగితే.. వెంకటాపురం 1, 2, ఎస్వీబీసీ కాలనీ, నందమూరి నగర్, పద్మనాభ పురం అని ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. ఈ గ్రామాల్లో నివాసం ఉండే దాదాపు 15 వేల మంది ఒత్తిడికిలోనై భయాందోళనకు గురికావొద్దు. ప్రతి మనిషికి రూ.10 వేల ఆర్థికసాయం అందించాలని కలెక్టర్‌కు ఆదేశాలిచ్చాం.

గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు
అన్ని రకాలుగా తోడుగా ఉంటామని మరోసారి చెబుతున్నా.. ఆ గ్రామాల్లో మెడికల్‌ క్యాంపులు పెట్టాలి. గ్రామాలకు వెళ్లలేని వారికి షెల్టర్, మంచి భోజన సదుపాయం కల్పించాలని కలెక్టర్‌కు ఆదేశిస్తున్నాం.

మంత్రులు, సీఎస్‌ ఇక్కడే ఉంటారు
జరిగిన ఘటన మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలో కమిటీ రిపోర్టు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. రెండ్రోజుల పాటు చీఫ్‌ సెక్రటరీ నీలం సాహ్ని ఇక్కడే ఉంటారు. విశాఖ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కన్నబాబు, ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు అవంతి, కృష్ణదాస్, బొత్స సత్యనారాయణ ఇక్కడే ఉంటారు. ఆ గ్రామాలకు ఏ అవసరం వచ్చినా.. దగ్గరుండి ఏ సమస్య రాకుండా చూసుకుంటారు.

జంతువులకు కూడా పరిహారం
గ్యాస్‌ లీకేజీ వల్ల జంతువులు కూడా చనిపోయాయని చెప్పారు. జంతువులకు సంబంధించి పరిహారం ఇవ్వడమే కాకుండా మరో జంతువును కొనిచ్చి మరో రూ. 20 వేలు ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నాం.

ఆ కుటుంబాలకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తా
చనిపోయిన మనుషులను నేను తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఉద్యోగాలు కూడా ఆ కంపెనీ నడిచిన తరువాతో.. లేక వేరే చోటకు మార్చిన తరువాతో రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం. ఎల్‌జీ కంపెనీ పెద్ద సంస్థ.. మంచి ప్రమాణాలను పాటిస్తుందని నమ్మకం ఉంది. ఎక్కడైనా ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాలు చేయమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.

ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది
జరిగిన ఘటన చాలా కలతచెందే విషయం. ఒక మంచి మనిషిగా చేయగలిగినది చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందు ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని, గ్రామాల్లో నివసించే వారిని జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులను మనవి చేస్తున్నా’ అని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.