
శ్రీశైల దేవస్థానం:రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు 04.02.2021 నుంచి అన్నదాన భవనములో అన్నప్రసాద వితరణను పున: ప్రారంభిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో స్థానికంగా ఉండే సాధువులకు, నిరాశ్రయులకు అన్నపొట్లాల ద్వారా అన్నప్రసాదాలను అందించారు.
దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండి భక్తులకు పులిహోర, పెరుగన్నం, సాంబారన్నం, కదంబ ప్రసాదం మొదలైనవి అందిస్తున్నారు.
ప్రస్తుతం కమిషనర్ ఉత్తర్వులను అనుసరించి అన్నదాన భవనములో అన్నప్రసాద వితరణను తిరిగి ప్రారంభిస్తున్నారు.
ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ అన్నప్రసాద వితరణ ఉంటుంది.
గతం లో వలే ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 3.00గంటల వరకు ఈ అన్న ప్రసాదాల వితరణ ఉంటుంది.
ఈ రోజు (03.02.2020) న కార్యనిర్వహణాధికారి అన్నదాన విభాగాన్ని పరిశీలించి అన్నప్రసాదాల వితరణపై సమీక్ష జరిపారు.
ఈ పరిశీలనలో అన్నదాన భవన సముదాయంలోని అన్నదాన ప్రదేశాలు, భక్తులు వేచి వుండే గదులు, అన్నదానం స్టోరు, వంటశాల మొదలైనవాటిని కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్నప్రసాద వితరణ జరపాలని అన్నదాన పర్యవేక్షకురాలు శ్రీమతి దేవికను ఆదేశించారు.
ఒక్కొక్క విడతలో అన్నదాన హాళ్ళ సామార్థ్యాలను అనుసరించి 50 శాతం వరకు మాత్రమే భక్తులు కూర్చునేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. దీనివలన భౌతికదూరాన్ని పాటించే అవకాశం ఏర్పడుతుందన్నారు.
ఒక్కో టేబుల్ కు మరో టేబుల్ కు మధ్య ఖాళీ ప్రదేశం ఉండేటట్లుగా టేబుళ్లను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో టేబుల్ వద్ద ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే భోజనం చేసే విధంగా విస్తర్లను వేయాలని సూచించారు.కరోనా నివారణ ముందస్తు చర్యలను సంబంధిత ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.భోజనానికి వచ్చే భక్తులందరు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి అన్నదానం క్యూలైన్లలో రావాల్సి ఉంటుందన్నారు. క్యూలైన్లలో కూడా భౌతిక దూరాన్ని పాటించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. భక్తులు తమ చేతులను శానిటైజేషన్ చేసుకునేందుకు వీలుగా అన్నదాన క్యూలైన్ల వద్ద, అన్నదాన ప్రవేశద్వారం వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేయాలన్నారు.ఈ విషయమై లెగ్ ఆపరేటేడ్ శానిటైజర్లను ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
భక్తుల భోజనాలు పూర్తయ్యాక వారు చేతులు కడిగే ప్రదేశములో కూడా భౌతికదూరం పాటించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇందుకోసమై ఒక కుళాయికి మరొక కుళాయికి మధ్య తగినంత దూరం ఉండే విధంగా నీటి సరఫరాను కల్పించాలన్నారు. అన్నదానం క్యూలైన్లను, క్యూలైన్లపైపులను,అన్నదానభవనములోని కటాంజాలను, రైలింగులు మొదలైన వాటిని నిర్ణీత సమయాలలో శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ చేయాలన్నారు. సిబ్బంది అందరు కూడా కరోనా వైరస్ నివారణకు అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలన్నారు. తరచుగా చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. వంటశాలలో విధులు నిర్వహించే వంటస్వాములు సబ్బునీటితో శుభ్రపరుచుకోవడం మంచిదని సూచించారు. ఎవ్వరు కూడా ఏమరుపాటుతో ఉండకూడదని అన్నారు.అన్నదానభవనాన్ని తరుచుగా శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరుస్తుండాలని అన్నారు. ముఖ్యంగా శుచిశుభ్రతపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు.
కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలైన మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను శుభ్రపరుచుకోవడం మొదలైన అంశాల గురించి భక్తులలో అవగాహన కల్పించేందుకు మైకు ద్వారా సూచనలు చేయాలని కార్యనిర్వహణాధికారి ఆదేశించారు.
అన్నదాన ప్రాంగణములో కరోనాను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఫ్లెక్సీబోర్డులను కూడా ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు. సిబ్బంది అందరు భక్తులతో మర్యాదతతో మెలగాలన్నారు. ప్రధానంగా సమయపాలనను పాటిస్తూ అన్నప్రసాద వితరణను చేయాలన్నారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ మురళీ బాలకృష్ణ, అన్నదాన పర్యవేక్షకురాలు శ్రీమతి దేవిక, అన్నదాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
* D.Venkata Rohini Kumar, Ongole donated Rs.1,01,116 /- For Annadhaanam scheme.
*Kumara Swamy Puuja, Sakshi Ganapati Abhishekam , Jwaala Veerabhadra Swamy Puuja performed in the temple.