అజయ్ లాంటి సీనియర్ పాత్రికేయులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య జర్నలిస్టుల పరిస్థితి ఏమిటి

-రాచకొండ సీపీకి  టీయూడబ్ల్యుజె వినతి

సీనియర్ పాత్రికేయులు, ప్రజాతంత్ర దినపత్రిక సంపాదకులు దేవులపల్లి అజయ్ కి గత ఆరు రోజులుగా ఆగంతకుల నుండి వస్తున్న బెదిరింపు కాల్స్ ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజె) తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై ఆగస్టు 23న, ఎల్బీనగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, కేసులో ఎలాంటి ప్రగతి లేదని  శుక్రవారం టీయూడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ ల నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించింది. అజయ్ కి ఆగంతకుల నుండి గత ఆరు రోజులుగా విచ్చల విడిగా బెదిరింపు కాల్స్, మెసేజ్ లు వస్తున్నప్పటికీ ఎల్బీనగర్ పోలీసుల నుండి ఆశించిన స్పందన కరువైందని టీయూడబ్ల్యుజె ప్రతినిధి బృందం సీపీతో ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించేందుకు పథకం ప్రకారమే కొన్ని అసాంఘిక శక్తులు ఇలాంటి అలజడి సృష్టిస్తున్నట్లు వారు వాపోయారు. రాష్ట్రంలో సుపరిచితులైన అజయ్ లాంటి సీనియర్ పాత్రికేయులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్య జర్నలిస్టుల పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యుజె వినతి పై స్పందించిన కమిషనర్ మహేష్ భగవత్ వెంటనే ఎల్బీనగర్ ఏసీపీతో ఫోన్లో మాట్లాడి కాల్ రికార్డ్స్ ఆధారంగా వెంటనే ఆగంతకులను గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలలు పునరావృతం కాకుండా పగడ్బందీ చర్యలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. సీపీని కలిసిన వారిలో ప్రజాతంత్ర సంపాదకులు దేవులపల్లి అజయ్, హెచ్.యు.జె కార్యదర్శి శిగ శంకర్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మోతె వెంకట్ రెడ్డి, యూనియన్ నాయకులు బాల్ రాజ్, తేజ తదితరులు ఉన్నారు.

print

Post Comment

You May Have Missed