*అందుబాటులోకి 145 కొత్త వాహనాలు*
*ప్రస్తుతం రాష్ట్రంలో 316 వాహనాలు*
*హైదరాబాద్ః రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 316 వాహనాలలోని పాత వాహనాల స్థానంలో 145 కొత్త ఉచిత సేవల 108 వాహనాలు ప్రజలకు చేరువ కానున్నాయి. ఎమర్జెన్సీ, ఇతర వైద్య సహాయ సేవలలో మంచి సేవలు అందిస్తున్న 108 నెంబర్ గల వాహనాలను మంగళవారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్ర ప్రజలకు మరిన్ని 108 ఉచిత సేవలు అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రంలో ఇఎంఆర్ఐ ఉచిత సేవల కోసం 108 వాహనాలు పని చేస్తున్నాయి. 365 రోజలూ, 24 గంటల పాటు 108 వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని వైద్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి . మేడ్చెల్ లోని కేంద్రం ద్వారా 316 వాహనాలు నడుస్తున్నాయి. కాగా మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనాలకు జీసీఎస్ ద్వారా అనుసంధానించారు . ప్రతి వాహనం 4.1 ట్రిప్పుల ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాయి. అయితే వీటిలో 145 వాహనాలు పాతబడి పోవడంతో వాటి స్థానంలో కొత్త వాహనాలను ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వం. కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ పర్యవేక్షణలో ఈ వాహనాలు పని చేస్తున్నాయి.
కాగా సగటున ప్రతి రోజూ 12,600 కాల్స్ ని అటెండ్ అవుతూ, 1,344 అత్యవసర సేవల లక్ష్యం కాగా, 1,453 సేవలను అందిస్తున్నది. ప్రతి వాహనం నెలలో సరా సరి ప్రయాణించాల్సిన కి.మీ. 4,500 కాగా, 5,127 కి.మీ ప్రయాణిస్తున్నది. ప్రతి నెలా 316 వాహనాల ద్వారా అత్యవసర ప్రసవ సేవల లక్ష్యం 10,500 కాగా, 14,723 అందిస్తున్నది. ప్రసవానంతర సేవల్లోనూ 2,323 మందిని వారి వారి ఇళ్ళకు క్షేమంగా చేర్చాయి.